వస్త్రోత్పత్తి లక్ష్యం సాధించాలి
సిరిసిల్ల: ప్రభుత్వం ఇచ్చిన వస్త్రోత్పత్తి ఆర్డర్ల లక్ష్యాన్ని సకాలంలో సాధించి, బట్టను అప్పగించాలని చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాతో కలిసి వస్త్రపరిశ్రమ యజమానులు, ఆసాములు, కార్మికులు, టెక్స్‌టైల్ పార్క్‌లోని పరిశ్రమల యజమానులతో సమీక్షించారు. శైలజా రామయ్యర్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ఆరు నెలలపాటు ఉపాధి కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. మిగతా రోజుల్లో ప్రైవేట్ మార్కెట్ నుంచి ఆర్డర్లు పొందాలని, వస్త్రమార్కెట్‌కు అనుగుణంగా వస్త్రాలను తయారు చేయాలని సూచించారు. తొలి విడతగా మహిళాశక్తి చీరలకు 2.12 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందించిందని, ఇవి కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, సమగ్ర శిక్ష అభియాన్ వస్త్రోత్పత్తి ఆర్డర్లు ఇచ్చినట్లు వివరించారు. వస్త్రోత్పత్తి ఆర్డర్లలో 50 శాతం మార్చి 15లోగా బట్టను అందించాలని శైలజా రామయ్యార్ ఆదేశించారు.
అర్హులకు బ్యాంకు రుణాలు
యజమానులు, ఆసాములు, కార్మికుల్లో అర్హులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బకాయిలను త్వరలోనే అందజేస్తామని ప్రకటించారు. ‘సెస్’ విద్యుత్ బ్యాక్ బిల్లింగ్ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. వస్త్రపరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చేనేత, జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారని గుర్తు చేశారు. వస్త్రపరిశ్రమ బాధ్యులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్డర్లు సకాలంలో పూర్తిచేస్తే మరిన్ని ఆర్డర్లు వస్తాయని తెలిపారు. యార్న్ బ్యాంక్ నుంచి ముడిసరుకు పంపిణీలో ఇబ్బందులు త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపా రు. టెస్కో ఇన్‌చార్జి జీఎం రఘునందన్, టెస్కో ఏడీ సందీప్‌జోషి గౌతమ్, సిరిసిల్ల జౌళిశాఖ ఏడీ సాగర్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, వస్త్రోత్పత్తిదారులు జేఏసీ అధ్యక్షుడు తాటిపాముల దామోదర్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి
సిరిసిల్లటౌన్: వస్త్రపరిశ్రమలోని నేతకార్మికుల ఉపాధి, సబ్సిడీ తదితర సమస్యలు పరిష్కరించాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ కోరారు. ఈమేరకు చేనేత, జౌళి శాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టెక్స్‌టైల్ పార్కులో మూతబడ్డ పరిశ్రమలను తెరిపించాలని కోరారు. కార్మికుల ఉపాధి, సబ్సిడీ, వర్కర్ టు ఓనర్, త్రిప్టు సమస్యలపై వినతిపత్రం అందించినట్లు వెల్లడించారు. సీఐటీయూ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ నాయకులు నక్క దేవదాస్, బెజుగం సురేష్, బాస శ్రీధర్, స్వర్గం శేఖర్ పాల్గొన్నారు.
15లోగా 50 శాతం వస్త్రాలు అందించాలి
ఆరు నెలలపాటు నేతన్నలకు ఉపాధి
అర్హులకు బ్యాంకు రుణాలు
చేనేత, జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
Comments
Please login to add a commentAdd a comment