16 నుంచి శివకల్యాణోత్సవం
వేములవాడ: శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 16 నుంచి 20 వరకు బ్రహ్మోత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. మహాశివరాత్రి మహోత్సవాలు ముగిసిన తర్వాత శివకల్యాణోత్సవం వైభవంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈనెల 12న కామదహనం, మూడు రోజులపాటు డోలోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. 17న ఉదయం పార్వతీరాజరాజేశ్వరస్వామి కల్యాణోత్సవం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. 19న రథోత్సవం, 20న త్రిశూలయాత్ర, పూర్ణాహుతి, ఏకాదశవరణములతో ఉత్సవాలు సమాప్తమవుతాయని వివరించారు.
వేములవాడలో స్మార్థవైదిక పద్ధతిలో..
రాష్ట్రంలోని అన్ని శైవక్షేత్రాల్లో ‘కారణాగమము’ అనుసరించి మహాశివరాత్రి పర్వదినం రోజునే కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం ‘స్మార్థ వైదిక’ పద్ధతిని అనుసరించి మహాశివరాత్రి అనంతరం కామదహనం మరుసటి రోజున కల్యాణోత్సవం నిర్వహిస్తారు. మన్మథుడు బాణం సంధించి ఈశ్వరుడిని తపస్సును భంగం చేయడంతో కోపోద్రిక్తుడైన శివుడు తన త్రినేత్రంతో దహనం చేశాడని శాస్త్రాలు చెబుతుంటాయి. ఈ నేపథ్యంలోనే కామదహనం మరుసటి రోజు కల్యాణం నిర్వహించుకుంటున్నట్లు అర్చకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment