సిరిసిల్ల: యాసంగి సీజన్ అన్నదాతలను కన్నీరు పెట్టిస్తోంది. అడుగంటిన భూగర్భ జలాలతో పొలాలు పారడం లేదు. వ్యవసాయబావులు, బోరుబావులు ఎత్తిపోవడంతో పంటపొలాలు ఎండిపోతున్నాయి. సాధారణ వర్షాల కంటే ఎక్కువే కురవడంతో చెరువులు, కుంటల్లో నీళ్లు ఉన్నాయన్న ఆశతో రైతులు యాసంగిలో వరిపంటను ఎక్కువగా సాగు చేశారు. అయితే పంట పొట్టకొచ్చేదశలో నీరందక పూర్తిగా ఎండిపోతుండడంతో కర్షకులు కన్నీరుపెట్టుకుంటున్నారు. జిల్లాలో అడుగంటిన భూగర్భజలాలు.. ఎండుతున్న పంటలపై ‘సాక్షి’ గ్రౌండ్‌రిపోర్టు.
పడిపోతున్న భూగర్భజలాలు
జిల్లాలో 1,77,042 ఎకరాల్లో వరిపంటను సాగైంది. వరి సాగు విస్తీర్ణం పెరగడంతో భూగర్భ జలాలు ఒక్కసారిగా పడిపోయి పొలాలు ఎండిపోతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో అత్యధిక లోతుకు 15.62 మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా గోదావరి జలాలను ఎత్తిపోశారు. ఈ ఏడాది ఎత్తిపోతల ఊసే లేకపోవడంతో జిల్లాకు గోదావరి జలాలు కరువయ్యాయి. బోయినపల్లి మండలం మధ్యమానేరు జలాశయంలో 16.19 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టులో పెద్దగా నీరు నిల్వ లేదు. గంభీరావుపేట ఎగువమానేరులోకి గోదావరి జలాలు పూర్తిస్థాయిలో రాలేదు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి మూలవాగులోనూ నీటి మట్టం తగ్గింది. మల్కపేట రిజర్వాయర్‌లో ఒక్క టీఎంసీ నీరు ఉంది. జిల్లాలో బావులు, బోర్ల ద్వారా నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలు పడిపోయాయి. మండుతున్న ఎండలకు బోర్లు ఎత్తిపోతున్నాయి. పంటలను కాపాడుకునేందుకు రైతులు మళ్లీ బోర్లు వేస్తూ భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment