గంభీరావుపేట(సిరిసిల్ల): ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్య ఈసారైనా పరిష్కారమవుతుందన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రతీ వానాకాలంలో గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య చిన్నపాటి వర్షానికి రాకపోకలు నిలిచిపోయేవి. ఈ సమస్యను పరిష్కరించేందుకు రెండేళ్ల క్రితం రూ.10కోట్లతో ప్రారంభించిన హైలెవల్ వంతెన పనులు ఇంకా పూర్తికాలేదు. వానాకాలం మొదలయ్యే నాటికి పనులు పూర్తికావడం అనుమానంగానే ఉంది. మళ్లీ వాగు ప్రవాహానికి రాకపోకలు నిలిచి ప్రయాణికులకు కష్టాలు తప్పేలా లేవు. ఇంకా పనులు ప్రారంభదశలోనే ఉన్నాయి.
లోలెవల్ వంతెనతో ఏటా కష్టాలు
గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య గల మానేరువాగుపై ఏళ్ల క్రితం లోలెవల్ వంతెన నిర్మించారు. వాగు ప్రవహిస్తే రాకపోకలు నిలిచిపోయేవి. దీంతో కామారెడ్డి నుంచి గంభీరావుపేట మీదుగా లింగన్నపేట, కొత్తపల్లి, ముస్తాబాద్ మండలం, సిద్దిపేట వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడేవారు. వీరంతా సిరిసిల్ల మీదుగా ఇబ్బంది పడుతూ వెళ్లేవారు. లింగన్నపేట, ముచ్చర్ల, కొత్తపల్లి, కోళ్లమద్ది, శ్రీగాథ, రాజుపేట గ్రామాలతోపాటు పక్క మండలాల నుంచి ప్రజలు ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం గంభీరావుపేటకు వస్తుంటారు. ఏటా వానాకాలంలో వీరికి ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు రెండేళ్ల క్రితం అప్పటి మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో హైలెవల్ వంతెన నిర్మాణానికి రూ.10కోట్లు మంజూరయ్యాయి. పాత బ్రిడ్జి కూల్చివేసి, పక్కకు మట్టి రోడ్డు పోసి హైలెవల్ వంతెన పనులు ప్రారంభించారు. పనుల్లో తీవ్ర జాప్యంతో నత్తకే నవ్వొచ్చేలా ఉంది.
పనులు జరుగుతున్నాయి
గంభీరావుపేట–లింగన్నపేట గ్రామాల మధ్య మానేరు వాగుపై హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ఫుట్టింగ్ స్థాయిలో ఉన్నాయి. పనుల్లో వేగం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కావడానికి కృషి చేస్తున్నాం.
– నరేందర్, ఆర్‌అండ్‌బీ ఏఈ,
గంభీరావుపేట
Comments
Please login to add a commentAdd a comment