● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● కుక్కకాటుకు గురైన బాలికకు పరామర్శ
సిరిసిల్ల: కుక్కకాటుకు గురై, గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. చిన్నబోనాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థిని గొట్టెముక్కల సువర్ణపై సోమవారం వీధికుక్క దాడి చేసింది. విద్యాలయం సిబ్బంది వెంటనే అప్రమత్తమై సిరిసిల్లలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జిల్లా కలెక్టర్ మంగళవారం విద్యార్థినిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని వార్డులను, బ్లడ్‌బ్యాంక్‌ను పరిశీలించారు. మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలి
వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో తాగునీటి సరఫరా, వేసవి ప్రణాళికపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఇబ్బందులున్న ప్రాంతాలను ముందే గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. మిడ్‌మానేర్, అప్పర్‌మానేర్ నుంచి తాగునీరు వేములవాడలోని గుర్రంవానిపల్లి 120 ఎంఎల్‌డీ, గంభీరావుపేట మండలంలోని కోళ్లమద్ది 7 ఎంఎల్‌డీ వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ల నుంచి 300 ఆవాసాలకు నీటి సరఫరా జరుగుతుందని, 75 ఆవాసాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సూచించారు. డీఆర్‌డీవో శేషాద్రి, మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా ఈఈలు జానకి, శేఖర్‌రెడ్డి, రాము, మున్సిపల్ కమిషనర్లు సమ్మయ్య, అన్వేశ్ పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల సమాచారం ఇవ్వండి
వేములవాడఅర్బన్: ఎల్‌ఆర్‌ఎస్–2020 దరఖాస్తుదారులు సమగ్ర సమాచారం ఇవ్వాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా సూచించారు. వేములవాడ నందికమాన్ ప్రాంతంలోని అంజన డెవలపర్స్‌కు సంబంధించిన శ్రీనివాస్ తన వెంచర్‌లో మొత్తం 11.25 ఎకరాల భూమి ఉండగా, అందులో 117 ప్లాట్స్ చేశారు. 1.06 ఎకరాలు పార్క్ కోసం వదిలినట్లు ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ వెంచర్‌ను జిల్లా కలెక్టర్, ఎల్‌ఆర్‌ఎస్ జిల్లా చైర్మన్ సందీప్‌కుమార్ ఝా, కమిటీ సభ్యులు ఆర్డీవో రాజేశ్వర్, పీఆర్, ఆర్‌ఆండ్‌బీ ఈఈలు, నీటీపారుదల శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, డీటీసీపీవో అన్సర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.