ఇతను గుగులోత్ రవి. వీర్నపల్లి మండలం భూక్యాతండాకు చెందిన గిరిజన రైతు. యాసంగి సీజన్‌లో రెండు ఎకరాల్లో వరిపంట వేశాడు. పంట పొట్టదశలో ఉండగా.. త్రీఫేజ్ కరెంట్ సరఫరా సరిగ్గా లేక అర ఎకరం పొలం ఎండిపోయింది. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడం, కరెంట్ సరఫరాలో అంతరాయంతో పొలం ఎండిపోయింది.
ఇతను రుద్రంగికి చెందిన చిట్టిపాక మల్లయ్య. తనకున్న 60 గుంటలతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగుచేశాడు. బోరులో పుష్కలంగా నీరున్నా కరెంట్ కోతలు, లోవోల్టేజీతో మోటారు నడవడం లేదు. ఫలితంగా పొలం పారడం లేదు. పొట్టదశలో ఉన్న పొలం ఎండిపోతుంది. లోవోల్టేజీ కరెంట్‌తో పలుమార్లు మోటార్లు కాలిపోయాయి.
ఎండుతున్న పంటలు●
● కాలుతున్న ట్రాన్స్‌ఫార్మర్లు ● తడారుతున్న వరిపొలాలు ● ఆందోళనలో రైతులు ● చి‘వరి’కి తిప్పలే..
ఇతను ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు చెందిన చిన్ని అంజిరెడ్డి. ఏడు ఎకరాలను పోత్గల్‌కు చెంది రైతు వద్ద కౌలుకు తీసుకుని వరిపంట వేశాడు. రెండు బోర్లలో ఒకటి ఎండిపోవడంతో ఒకటే పోస్తుంది. త్రీఫేజ్ కరెంట్ సరిగ్గా రాకపోవడంతో పొలం పారడం లేదు. అందరి బోర్లు నడవడంతో అంజి రెడ్డి పొలం పారడం లేదు. దీంతో జనరేటర్‌ను అద్దెకు తీసుకుని గంటకు ఆరు నుంచి ఎనిమిది గుంటల పొలాన్ని పారిస్తున్నాడు. రోజుకు డీజిల్, జనరేటర్ అద్దె రూ.2వేలు అవుతుంది.. ఇలా జిల్లా వ్యాప్తంగా రైతులు ‘కరెంట్’ కష్టాలు ఎదుర్కొంటున్నారు.
సిరిసిల్ల: జిల్లాలో వ్యవసాయానికి 17 గంటలు త్రీఫేజ్ విద్యుత్ సరఫరా అవుతోంది. రాత్రి 12.30 గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటల పాటు సరఫరా చేస్తున్నారు. కానీ అప్రకటిత కోతలతో పొలాలు పారడం లేదు. మధ్యలో కరెంట్ పోతే.. రైతులు పొలాల వద్దకు మళ్లీ వెళ్లకుండా రాత్రి నిద్రపోవడంతో పొలం పారడం లేదు. నిరాటంకంగా విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరో వైపు లోవోల్టేజీ సమస్యలతో కూడిన కరెంట్ సరఫరా అవుతుంది. ట్రాన్స్‌ఫార్మర్లపై విద్యుత్ వినియోగ భారం పడి కాలిపోతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోతే.. రీప్లేస్ చేసేందుకు రెండు, మూడు రోజులు పడుతుంది. ఫలితంగా ఆ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలోని బోర్లు, మోటార్లు నడవడం లేదు. ఒక్కసారి పొలం ఆరితే.. మళ్లీ పారడం కష్టమవుతుంది. ఎండలు మండిపోతున్న దశలో కరెంట్ కష్టాలు ఇబ్బందిగా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) విద్యుత్ పంపిణీ చేస్తుండగా.. ఎన్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ సబ్‌స్టేషన్లను పర్యవేక్షిస్తున్నారు. సబ్‌స్టేషన్లలో మరమ్మతుల కారణంగా కరెంట్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగానే చివరి దశలో వరి మడి.. తడి ఆరి రైతులు తల్లడిల్లుతున్నారు.
పంట చేతికి
జిల్లా వ్యాప్తంగా మరో పక్షం రోజుల్లో వరి పంట చేతికి అందుతుంది. యాసంగి సీజన్‌లో 1,82,256 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇందులో వరి పంట 1,78,350 ఎకరాల్లో సాగైంది. గతంతో పోల్చితే జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. కానీ భూగర్భజలాలు అడుగంటిపోయి బోర్లు ఎత్తిపోయి 20 శాతం మేరకు పంటలు పొట్టదశలో ఎండిపోయాయి. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో చేతికందే దశలో పొలాలు తడారుతున్నాయి. ఎండిన పొలాల్లో పశువులను మేపుతున్నారు.
విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేవు
జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులేమీ లేవు. వ్యవసాయానికి త్రీఫేజ్ కరెంట్ ఎప్పటిలాగే అందిస్తున్నాం. ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్ ఫెయిల్ అయితే వెంటనే మార్చుతున్నాం. ట్రాన్స్‌ఫార్మర్ల రవాణాకు ఆరు వాహనాలు ఉన్నాయి. సాంకేతిక సమస్యలతో అప్పుడప్పుడూ సరఫరాలో అంతరాయం సహజంగానే ఉంటుంది. విద్యుత్ కోతలు ఏమీ లేవు.
– విజయేందర్‌రెడ్డి ‘సెస్’ ఎండీ, సిరిసిల్ల
జిల్లా విద్యుత్ సమాచారం
గ్రామాలు : 260
వ్యవసాయ కనెక్షన్లు : 78,611
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు : 9,928
వ్యవసాయ ఫీడర్లు : 175
మిశ్రమ ఫీడర్లు : 90
వరి విస్తీర్ణం : 1,78,350 ఎకరాలు
విద్యుత్ సబ్‌స్టేషన్లు : 72
కరెంట్ కట్‌కట!
కరెంట్ కట్‌కట!
కరెంట్ కట్‌కట!
కరెంట్ కట్‌కట!