● ఆర్డీవో రాజేశ్వర్
వేములవాడ: రాజన్న ఆలయంలో ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు సీతారాముల కల్యాణోత్సవాలను గతంలోకంటే ఘనంగా జరిపించాలని, ఇందుకు కావాల్సిన సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆర్డీవో రాజేశ్వర్ సూచించారు. మంగళవారం చైర్మన్ చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. శ్రీరామనవమి రోజు రాజన్న ఆలయంలో జరిగే సీతారాముల కల్యాణానికి అశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆలయ ఈవో కొప్పుల వినోద్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీరామనవమికి వచ్చే భక్తులకు తాగునీటి సరఫరా, క్యూ లైన్‌లు, తాత్కాలిక మరుగుదొడ్లు, రవాణా, పారిశుధ్యం, ఫైర్, కల్యాణ వేదికలాంటి ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. వేసవికాలం దృష్ట్యా భక్తులకు ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖను కోరారు. భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు, అన్నదానం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.