
కూలీ రేట్లు నిర్ణయించాలని..
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో నేత కార్మికులు (పవర్‌లూమ్) వస్త్రోత్పత్తిని బంద్ చేసి మంగళవారం రోడ్డెక్కారు. ప్రభుత్వం ఇచ్చిన మహిళా శక్తి చీరల ఉత్పత్తి ఆర్డర్లకు నేత కార్మికులకు చెల్లించే కూలి నిర్ణయించాలని, 2023 నాటి బతుకమ్మ చీరలకు చెల్లించాల్సిన 10 శాతం యారన్ సబ్సిడీ సొమ్మును చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పవర్‌లూమ్ కార్మికులు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల బీవై నగర్ నుంచి నేతన్న చౌక్ వరకు ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిరిసిల్లలో పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసే కార్మికులకు ఒప్పందం ప్రకారం కూలీ చెల్లించాలని, వర్కర్ టూ ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులను యజమానులను చేయాలని, ప్రభుత్వం ఉత్పత్తి చేయిస్తున్న మహిళా శక్తి చీరలకు సంబంధించిన పవర్‌లూమ్ వార్పిన్, వైపని కార్మికులకు 10 శాతం యారన్ సబ్సిడీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు డిమాండ్లతో నేతకార్మికులు సాంచాలను బంద్ చేసి రోడ్డెక్కి నిరసన తెలిపారు. నేత కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేదాకా.. వస్త్రోత్పత్తిని నిలిపివేస్తామని, సాంచాలు(పవర్‌లూమ్స్) నడుపమని స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ, కార్మికులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో రోడ్డెక్కిన నేతన్నలు
వస్త్రోత్పత్తి బంద్ చేసి నేతన్నల ఆందోళన
యారన్ సబ్సిడీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్