
● ఇది దేశంలోనే ప్రథమం ● రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ
సిరిసిల్ల: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, కానీ కొన్ని పథకాలు మానసికంగా ఎంతో సంతోషాన్ని ఇస్తాయని, పేదలకు సన్నబియ్యం ఇవ్వడం మానసికంగా సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్ల కొత్త బస్టాండు సమీపంలోని ఇందిరానగర్ రేషన్ షాపులో సన్నబియ్యం పంపిణీకి మంగళవారం శ్రీకారం చుట్టారు. దేశంలోనే తొలి మనరాష్ట్రంలో పేదలకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 17,263 రేషన్‌షాపుల్లో సన్నబియ్యం ఇవ్వ డం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళామణులను కోటీశ్వరులుగా చేయాలని సదుద్దేశంతో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి కింద వివిధ యూ నిట్లు ప్రారంభించామని అన్నారు. అలాగే సోలార్ యూనిట్లు మహిళా సంఘాలకు బస్సులు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. సన్న వడ్లు పండించే రైతులకు ప్రతీ క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని వివరించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస మాట్లాడుతూ జిల్లాలోని 345 రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే, అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీవో రాధాబాయి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపారెడ్డి, డీఎస్ వో వసంతలక్ష్మీ, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ రజిత, కాంగ్రెస్ నాయకులు చొప్పదండి ప్రకాశ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నర్సయ్య, సూర దేవరాజు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన వస్త్రోత్పత్తిదారులు
సిరిసిల్లకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌ను వస్త్రోత్పత్తిదారులు కలిసి విద్యుత్ బిల్లుల సమస్యను వివరించారు. ‘సెస్’ అధికారులు బ్యాక్ బిల్లింగ్ పేరిట కరెంట్ బిల్లులు విధించారని, 126 కార్ఖానాలు మూతపడ్డాయని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, ప్రతినిధులు గోవిందు రవి, పద్మశాలీ సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటై అడ్డంకులు
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటై రాష్ట్రంలో ప్రజాపాలనకు అడ్డంకులు సృష్టిస్తున్నాయని, ఆ రెండు పార్టీలు కవలపిల్లలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)కి సంబంధం లేని గోపనపల్లి, కంచ శివారుల్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూములను అభివృద్ధి చేస్తుంటే.. విద్యార్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నారని ఆరోపించారు.