
ప్రభుత్వ బడిలో మేక బలికి యత్నం
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని శివనగర్ కుసుమ రామయ్య హైస్కూల్‌లో శుక్రవారం తెల్లవారు జామున మేకను బలి ఇచ్చేందుకు ప్రయత్నించడం కలకలం సృష్టించింది. కొందరు వ్యక్తులు పాఠశాలకు మేకను తీసుకొచ్చిన విషయాన్ని గమనించిన స్థానికులు పలువురికి సమాచారం అందించారు. అక్కడికి స్థానికులతోపాటు మీడియా వెళ్లి చూడగా మేకపిల్లను బలి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న పలువురు కనిపించారు. అక్కడే ఉన్న వారిని ఆరా తీస్తే పొంతన లేని సమాధానాలు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. నూతనంగా అదనపు గది నిర్మిస్తుండడంతో సంప్రదాయబద్ధంగా కార్యక్రమం చేశామంటూ ఒకరు, బోరులో నీళ్లు రాకపోవడంతో పూజ చేశామని మరొకరు.. అసలు మేక ఇక్కడికి రావడానికి తమకు సంబంధం లేదని మరొకరు చెప్పడం గమనార్హం. అయితే గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత వెంకన్న అనే ఉద్యోగి స్కూల్ గేట్ తెరవడంతో కొందరు వ్యక్తులు మేకను తీసుకురావడం పలువురు స్థానికులు గమనించి మీడియాకు తెలియజేశారు. అక్కడికి స్థానికులు, మీడియా చేరుకోవడంతో వెంకన్న అనే వ్యక్తి అక్కడి నుంచి జారుకున్నాడు. దీనిపై మండల విద్యాధికారి రఘుపతిని వివరణ కోరగా పాఠశాలలో మేకను బలివ్వలేదన్నారు .మేకను తీసుకొచ్చిన వ్యక్తులకు పాఠశాలకు సంబంధం లేదని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ విషయమై జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు మాట్లాడుతూ పాఠశాలలో ఇలాంటివి జరగడం సరికాదన్నారు. మండల విద్యాధికారి దర్యాప్తు చేపడుతున్నారని.. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపారు .
స్థానికులు, మీడియా రావడంతో ఆగిన బలి
ఉద్యోగుల నుంచి పొంతన లేని సమాధానం
ఘటనపై ఎటూ తేల్చని విద్యాశాఖ