
నేడు రాములోరి పెళ్లి
● రాజన్న సన్నిధిలో ఏర్పాట్లు పూర్తి ● భారీగా తరలివస్తున్న శివపార్వతులు ● మున్సిపల్ తరఫున పట్టువస్త్రాలు
వేములవాడ: శ్రీరామ నవమి వేడుకలకు శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం ముస్తాబైంది. రాజన్న ఆలయంలో రాములోరి కల్యాణానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే చైర్మన్ చాంబర్ ఎదుట కల్యాణ వేదిక పనులు దాదాపు పూర్తయ్యాయి. ఎండలు ముదరడంతో భక్తుల కోసం చలువ పందిళ్లు వేయించారు. తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నారు. ఆది వారం ఉదయం 11.55 గంటలకు శ్రీసీతా రాముల కల్యాణోత్సవం నిర్వహణకు ఆలయ అధికారులు సర్వం సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం వరకే లక్షకు పైగా భక్తులు వేములవాడకు చేరుకున్నట్లు సమాచారం.
భక్తులతో సందడి..
వేములవాడ పట్టణం శనివారం నుంచే భక్తులతో సందడిగా మారింది. ఆలయ ప్రాంగణం శివపార్వతులతో కిక్కిరిసిపోయింది. శివపార్వతుల పూనకాలు, జోగినులు, హిజ్రాల నృత్యాలతో హోరెత్తిపోతోంది. కల్యాణోత్సవాన్ని భక్తులు తిలకించేందుకు ఆలయం ముందు నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు షామియానాలు వేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు చైర్మన్ చాంబర్ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక కల్యాణ వేదికపై కనులపండువగా కల్యాణం నిర్వహించనున్నారు.
మున్సిపల్ తరఫున పట్టువస్త్రాలు
శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి స్థానిక మున్సిపల్ తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అధికారులు, సిబ్బంది ఆలయ అధికారులకు అందజేస్తారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆలయానికి వచ్చి పురప్రముఖుల ఆధ్వర్యంలో అందజేయనున్నట్లు కమిషనర్ అన్వేశ్ తెలిపారు.
శివపార్వతుల కోసం వసతులు
రాజన్న ఆలయంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి భారీగా శివపార్వతులు, హిజ్రాలు తరలివస్తుంటారు. వీరి కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శివుడిని భర్తగా భావించి వివాహమాడడం ఇక్కడి ఆనవాయితీ. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ఆలయం తరఫున పూర్తి చేశారు. శివపార్వతుల కోసం ఆలయ ప్రాంతం, జాతరాగ్రౌండ్‌లలో రాగి వస్తువులు, రుద్రాక్ష, త్రిశూలం, లింగాలు, గంటలు, బాసింగాలు అమ్మేందుకు సిద్ధం చేసి ఉంచారు.
భారీగా ఏర్పాట్లు
కల్యాణోత్సవానికి రూ.25లక్షలతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఈ రాజేశ్ తెలిపారు. 2 లక్షల లీటర్ల తాగునీటిని అందుబాటులో ఉంచారు. 15 వేల లీటర్ల మజ్జిగను భక్తులకు అందజేయనున్నారు. 25వేల మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 11 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆటోల ద్వారా తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు చలువ పందిళ్ల కింద కూలర్లను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం రథోత్సవం కనుల పండువగా జరగనుంది. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ఆధ్వర్యంలో 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

నేడు రాములోరి పెళ్లి

నేడు రాములోరి పెళ్లి