
● దరఖాస్తులకు నిరీక్షణ.. మీసేవ కేంద్రాల్లో పడిగాపులు ●
ఇతను సిరిసిల్ల శాంతినగర్‌కు చెందిన వెంగల శ్రీకాంత్(36). బీఎస్సీ చదువుకున్నాడు. అమ్మ బీడీ కార్మికురాలు, నాన్న పవర్‌లూమ్‌వర్కర్. రాజీవ్ యువవికాసంలో కిరాణషాపు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. రూ.4లక్షల రాయితీ పథకానికి దరఖాస్తు చేసేందుకు కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్ల కోసం సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్‌కు వస్తే.. సైట్ స్లో ఉండడంతో సర్టిఫికెట్ల జారీ జాప్యమవుతోంది.
ఇది సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్‌లోని గిర్దావర్(రెవెన్యూ ఇన్‌స్పెక్టర్) చాంబర్. వివిధ సర్టిఫికెట్లపై ఆర్‌ఐ సంతకాల కోసం సిరిసిల్ల పట్టణ వాసులు నిరీక్షించాల్సి వస్తోంది. దరఖాస్తుదారుల వివరాలు, రేషన్‌కార్డు, గతంలో జారీ అయిన సర్టిఫికెట్లను పరిశీలించి అన్నీ సవ్యంగా ఉంటే ధ్రువీకరిస్తున్నారు. కానీ ఒకేసారి అందరూ రావడంతో ఇలా ఇరుకుగదిలో దరఖాస్తుదారులు నిరీక్షించాల్సి వస్తోంది.
సిరిసిల్ల: నిరుద్యోగ యువతీ, యువకులకు స్థానికంగానే స్వయం ఉపాధి అందించే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణ ప్రాంతాల వారు స్థానిక ఎంపీడీవో ఆఫీస్‌లో, పట్టణాల్లోని వారు మున్సిపల్ ఆఫీస్‌ల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు అర్హులు. ఏప్రిల్ 14వ తేదీలోగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. గడువులోగా వచ్చిన దరఖాస్తులను మండల స్థాయి కమిటీ పరిశీలించి, అర్హుల జాబితాను జిల్లా కమిటీకి పంపిస్తుంది. జిల్లాస్థాయిలో ఎంపికై న వారికి శిక్షణ ఇచ్చి బ్యాంకుల సహకారంతో రుణాలు అందిస్తారు. దరఖాస్తుల వెంట ఆధార్‌కా ర్డు, రేషన్‌కార్డు, ఆదాయ, కులధ్రువీకరణ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, వ్యవసాయ పథకాలకు పట్టాదార్ పాస్‌బుక్కు, దివ్యాంగులు సదరం సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజు ఫొటో జతచేయాల్సి ఉంటుంది. వ్యవసాయేతర యూనిట్లకు 21–55 ఏళ్ల వారు, వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు 21–60 ఏళ్లు (2024, జూలై 1 నాటికి) ఉండాలి.
ఇవీ రాయితీ వివరాలు
రూ.50వేలలోపు యూనిట్‌కు వందశాతం రాయితీ ఉండగా, రూ.లక్షలోపు యూనిట్‌కు 90 శాతం రాయితీ.. 10 శాతం బ్యాంకు లోను, రూ.2లక్షలలోపు యూనిట్‌కు 80 శాతం రాయితీ.. 20 శాతం బ్యాంకు లోను, రూ.4లక్షల యూనిట్‌కు 70 శాతం రాయితీ.. 30 శాతం బ్యాంకు లోను ఉంటుంది. బలహీనవర్గాల సమూహానికి యూనిట్లకు రూ.లక్ష వరకు వంద శాతం రాయితీ, చిన్ననీటిపారుదల యూనిట్‌కు వంద శాతం రాయితీ వర్తిస్తుంది.
ఇల్లంతకుంటలో అత్యధికం.. రుద్రంగిలో అత్యల్పం
రాజీవ్ యువవికాసం పథకానికి 5,391 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా ఇల్లంతకుంటలో 684, అత్యల్పంగా రుద్రంగిలో 56 దరఖాస్తులు వచ్చాయి. బోయినపల్లిలో 373, చందుర్తిలో 272, గంభీరావుపేటలో 525, కోనరావుపేటలో 496, ముస్తాబాద్‌లో 680, సిరిసిల్ల పట్టణంలో 303, తంగళ్లపల్లిలో 423, వీర్నపల్లిలో 177, వేములవాడ రూరల్‌లో 280, వేములవాడ అర్బన్‌లో 251, వేములవాడ మున్సిపల్‌లో 365, ఎల్లారెడ్డిపేటలో 506 దరఖాస్తులు వచ్చాయి.
ఇది సిరిసిల్ల పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్ పక్కనే ఉన్న మీసేవ కేంద్రం. ఏప్రిల్ 14 వరకు రాజీవ్ యువవికాసం పథకానికి దరఖాస్తు చేయడానికి గడువు పొడగించడంతో అవసరమైన సర్టిఫికెట్ల కోసం ఇలా మీసేవ కేంద్రంలో క్యూ కట్టారు. కులం, ఆదాయం, నివాసం సర్టిఫికెట్లకు దరఖాస్తు ఫారాలు నింపి ఆన్‌లైన్ చేయడానికి వస్తే రెవెన్యూశాఖ సర్వర్ స్లోగా పనిచేస్తుంది. ఫలితంగా దరఖాస్తుదారులు గంటల తరబడి మీసేవ కేంద్రాల్లోనే నిరీక్షించాల్సి వస్తోంది.
జిల్లాలో రాజీవ్ యువవికాసం ఇలా..
గ్రామాలు: 260, పట్టణాలు: 02
ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులు : 5,391 (07.04.2025 నాటికి)
ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులు : 664

● దరఖాస్తులకు నిరీక్షణ.. మీసేవ కేంద్రాల్లో పడిగాపులు ●

● దరఖాస్తులకు నిరీక్షణ.. మీసేవ కేంద్రాల్లో పడిగాపులు ●