
మానవత్వం చాటుకున్న గ్రామస్తులు
చొప్పదండి: నిరుపేద అర్చకుని భార్య మృతి చెందడంతో అంత్యక్రియలకు తమవంతు సాయం చేసి, అంత్యక్రియల్లో పాల్గొని మానవత్వం చాటుకున్నారు మండలంలోని ఆర్నకొండ గ్రామస్తులు. ఆర్నకొండలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో పదేళ్లుగా నమిలికొండ మురళీకృష్ణ అర్చకుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం అర్చకుడి భార్య ఆకస్మిక మృతి చెందగా, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న అర్చకుడి కుటుంబానికి గ్రామస్తులు అండగా నిలిచారు. గంట సమయంలోనే సుమారు రూ.50వేల వరకు పోగు చేసి, దగ్గరుండి అంత్యక్రియలు పూర్తి చేశారు. అర్చక కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులకు అర్చక పురోహితుల సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.