ఊసే లేని కొత్త పెన్షన్ల మంజూరు | - | Sakshi
Sakshi News home page

ఊసే లేని కొత్త పెన్షన్ల మంజూరు

Published Thu, Nov 16 2023 6:22 AM | Last Updated on Thu, Nov 16 2023 10:47 AM

- - Sakshi

హైదరాబాద్: పేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల సామాజిక పెన్షన్ల పెంపుపై ఆశలు చిగురిస్తున్నా.. ఇప్పటి వరకు పెన్షన్‌ మంజూరు కాని అభాగ్యుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. గత కొన్నేళ్లుగా కొత్తగా సామాజిక పెన్షన్ల మంజూరు లేకుండా పోయింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార బీఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ తమ మేనిఫెస్టోల్లో సామాజిక పెన్షన్ల పెంపుపై స్పష్టమైన హామీలు ఇచ్చాయి.

అధికార బీఆర్‌ఎస్‌ ప్రస్తుతం రూ. 2016 పెన్షన్‌ను రూ.5 వేలకు విడతల వారీగా పెంచుతామని ప్రకటించింది. వచ్చే మార్చి తర్వాత పెన్షన్‌ను రూ.3 వేలు, ఆ తర్వాత ప్రతి సంవత్సరం రూ. 500 పెంచుతూ ఐదో సంవత్సరం నిండేనాటికి రూ.5వేలకు అందిస్తామని పేర్కొంది. దివ్యాంగుల పెన్షన్‌ రూ.4016కు ఉండగా, మార్చి తర్వాత రూ.5వేలు చేసి.. ప్రతి సంవత్సరం రూ. 300కి చొప్పున ఆరు వేలకు వరకు పెంచుతామని స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వస్తే సామాజిక పెన్షన్లను రూ. 4000కు పెంచుతామని ప్రకటించింది. దీనిపై పేదలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

పెండింగ్‌లోనే..
నాలుగేళ్లుగా కొత్త పెన్షన్ల మంజూరు ఊసే లేకుండా పోయింది. రెండేళ్ల క్రితం వయసు సడలింపునకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తుల్లో కొన్నింటికి మాత్రమే మంజూరు లభించగా మిగతావి తిరస్కరణకు గురయ్యాయి. సామాజిక పెన్షన్లకు సంబంధించిన ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు మాత్రం పెండింగ్‌లో మగ్గుతున్నాయి. కొత్త పింఛన్ల మంజూరుకు ప్రధానంగా బడ్జెట్‌ సమస్యగా తయారైనట్లు తెలుస్తోంది. 65 ఏళ్లు దాటిన వృద్ధాప్య, వింతంతు, వికలాంగ, ఒంటరి మహిళలు, కల్లుగీత, బీడీ తదితర పింఛన్ల దరఖాస్తులకు మోక్షం లభించడం లేదు. వాస్తవంగా ఆసరా పింఛన్ల దరఖాస్తుల నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. కేవలం దరఖాస్తుల స్వీకరణ తప్ప మంజూరు మాత్రం లేకుండా పోయింది.

తహసీల్‌ ఆఫీసులో సమర్పించిన దరఖాస్తులుపై క్షేత్ర స్థాయి విచారణ జరిపి అధికారులు అర్హుల జాబితాలను కలెక్టరేట్‌కు సిఫార్సు చేయడం, ఆ తర్వాత కలెక్టర్‌ ఆమోదంతో సెర్ఫ్‌నకు ప్రతిపాదనలువెళ్తున్నా.. మంజూరు మాత్రం పెండింగ్‌లో పడిపోతున్నాయి. గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా గ్రేటర్‌ పరిధిలోని సుమారు రెండు లక్షలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అనధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు వృద్ధాప్య పింఛనుదారు మృతి చెందితే అతని భార్యకు పింఛన్ల మంజూరు కూడా లేకుండా పోయింది. దరఖాస్తుదారులు కలెక్టరేట్‌, తహసీల్‌ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా.. పింఛన్లు ఎప్పుడు మంజూరవుతాయో అధికారుల్లో స్పష్టత కరువైంది. దీంతో పెండెన్సీ దరఖాస్తులన్నింటినీ క్లియర్‌ చేసి కొత్తగా మంజూరు ఇవ్వాలని పేద కుటుంబాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

గ్రేటర్‌ పరిధిలో ప్రస్తుతం ఆసరా పింఛన్లు ఇలా..
హైదరాబాద్‌ 2,59,985

రంగారెడ్డి 2,02,129

మేడ్చల్‌ 1,47,053

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement