‘మీ సేవ’లో సమస్యలు
మీ సేవా కేంద్రాల్లో చెల్లించే రుసుముకు ఆన్‌లైన్ పేమెంట్ తప్పనిసరి చేయడంతో ప్రజలకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. స్మార్ట్ ఫోన్, ఫోన్‌పే విధానంపై అవగాహన లేని వారు ఇతరులను ఆశ్రయించి అవస్థలపాలవుతున్నారు.
మంచాల: ప్రభుత్వ నుంచి ఏ సర్టిఫికెట్ కావాలన్నా మీ సేవా కేంద్రాల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్, రెవెన్యూ, జనన, మరణ ధృవీకరణ సర్టిఫికెట్లను సైతం ప్రభుత్వం మీ సేవా కేంద్రాల నుంచే అందజేస్తోంది. ఆన్‌లైన్ విధానంలో నిర్ణీత కాలంలో ప్రజలకు సర్టిఫికెట్‌లు అందజేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఈ మేరకు మండల కేంద్రంతో పాటుగా గ్రామాల్లోనూ ఏర్పాటు చేయించింది.
పాత పద్ధతికి మంగళం
గతంలో తమ వద్దనున్న ఆధారాలతో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునేవారు. మీ సేవా నిర్వహకులకు రుసుమును నగదు రూపంలో చెల్లించేవారు. దరఖాస్తులు చేసుకునే సమయంలో నిర్వహకులు ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఐదు నెలలుగా ఆన్‌లైన్ విధానం అమలు చేస్తోంది. దీంతో రైతులు, స్మార్ట్ ఫోన్ వాడని వారు.. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్‌పే లేని వారు స్కానింగ్ చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ అందుబాటులో ఉన్నవారిని బ్రతిమిలాడుతూ.. నగదు ఇస్తాం.. స్కాన్ చేసి సాయం చేయాలని కోరుతున్నారు. స్కానర్‌తో పాటుగా తమలాంటి వారి కోసం నగదు రూపంలోనూ రుసుం స్వీకరించాలని కోరుతున్నారు. ఇదే విషయమై మీ సేవా నిర్వహకులను కోరగా ప్రభుత్వ నిబంధనలు అమలు చేయడమే తమ విధి అని సమాధానం ఇచ్చారు.
ఇబ్బంది పడుతున్న ప్రజలు
ఆన్లైన్ విధానంలోనే రుసుము చెల్లింపులకు అనుమతి
వెసులుబాటు కల్పించాలి
ఈ మధ్య కాలంలో కుల, ఆధాయ సర్టిఫికెట్లు తీసుకోవాలంటే మీసేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ చేయాలని నిబంధన పెట్టారు. దీంతో స్మార్ట్ ఫోన్ వాడని తమలాంటి వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇతరులను బత్రిమిలాడుకుని స్కాన్ చేయించుకుంటున్నాం. దీన్ని నుంచి తమకు వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం.
– పాండునాయక్, రైతు, ఎల్లమ్మతండా
రుసుము చెల్లించాల్సి ఉంటుంది
మాకు మీ సేవా నిబంధనలు తెలియవు. అవి నిర్వహకులకు మాత్రమే అవగాహన ఉంటుంది. కొంత రుసుము మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. ఎలా చెల్లించాలనేది నిర్వహకులను అడిగి తెలుసుకుంటాం.
– ఎంవీ ప్రసాద్, తహసీల్దార్, మంచాల
‘మీ సేవ’లో సమస్యలు
‘మీ సేవ’లో సమస్యలు
Comments
Please login to add a commentAdd a comment