కూలుతున్న కాపురాలు
ప్రతీఒక్కరి జీవితంలో వివాహం ఓ మధుర ఘట్టం. భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని సంసార సాగరంలోకి అడుగేస్తారు నూతన దంపతులు. ఈ క్రమంలో తలెత్తే చిన్నపాటి స్పర్థలకే కొంతమంది బంగారం లాంటి బంధాన్ని తెంచుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపించి, సమాజంలో విడాకుల ధోరణి విపరీతమవుతోంది.
హుడాకాంప్లెక్స్: భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవలు చినికిచినికి గాలివానలా మారుతున్నాయి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు చివరకు పోలీసు స్టేషన్లకు చేరుతున్నాయి. నువ్వెంత..? అంటే నువ్వెంత..? అనే అహంకార వలలో చిక్కి చివరకు విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా 2024 డిసెంబర్ నాటికి సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్‌లో 2,200 గృహహింస, అత్యాచారం, అదనపు కట్నం వేధింపుల ఫిర్యాదులు అందగా, వీటిలో 540 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.
పంతాలు, పట్టింపులు
పంతాలు, పట్టింపులకు పోయి.. ఠాణాకు వస్తున్న జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. 2024లో మహేశ్వర్యం జోన్‌లో 301, ఎల్బీనగర్‌జోన్‌లో 1,325, మల్కాజ్‌గిరి జోన్‌లో 1,513 మంది దంపతులకు ఫ్యామిలీ కౌన్సెలింగ్స్ నిర్వహించారు. సాధ్యమైనంత వరకు వారికి నచ్చజెప్పి.. ఒకటి చేసే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటికే రెండు కుటుంబాల మధ్య వివాదం తార స్థాయికి చేరుకోవడం విడాకులకు కారణమవుతోంది. ఫలితంగా కోర్టుల్లో ఈ తరహా కేసుల జాబితా ఏటా పెరుగుతోంది. గత డిసెంబర్ వరకు ఎల్బీనగర్ ఫ్యామిలీ కోర్టు పరిధిలో 314 కేసులు, అడిషినల్ ఫ్యామిలీ కోర్టులో 353 కేసులు, కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో 163 కేసులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసులు ఇలా
2023 2024
వరకట్నం 16 18
గృహ హింస 1582 1222
పోక్సో 317 392
అత్యాచారాలు 327 384
ఫ వనస్థలిపురానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మమతకు ఎల్బీనగర్‌కు చెందిన ఐటీ ఉద్యోగి శేఖర్‌తో ఏడాది క్రితం వివాహమైంది. భర్త తనను తరచూ వేధిస్తున్నాడని, ఇకపై ఆయనతో కలిసి ఉండలేనని పేర్కొంటూ ఇటీవల ఆమె సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. చిన్న అంశంపై నెలకొన్న మనస్పర్థలు చివరకు విడాకుల వరకు దారి తీశాయి.
ఫ మీర్‌పేటకు చెందిన అరుణ.. అదే ప్రాంతానికి చెందిన శ్రవణ్‌కుమార్‌తో రెండేళ్ల క్రితం పైళ్లెంది. వీరికి ఓ పాప ఉంది. అదనపు కట్నం కావాలని భర్త వేధిస్తుండటంతో భార్య పోలీసులను ఆశ్రయించింది. కులపెద్దలు, నిపుణులు కౌన్సెలింగ్ ఇచ్చినా ఇద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు. చివరకు ఈ పంచాయితీ విడాకుల వరకు వెళ్లింది. ఇలా మమత, అరుణ దంపతులు మాత్రమే కాదు. అనేక మంది చిన్నచిన్న విషయాలకే కోర్టు మెట్లెక్కి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
చిన్నపాటి మనస్పర్థలకే తెగిపోతున్న బంధాలు
అకారణ వివాదాలతో ఆగమవుతున్న జంటలు
సరూర్‌నగర్ మహిళా పీఎస్‌లో ఏటా పెరుగుతున్న కేసులు
సర్దుబాటు ధోరణి నశించడమే కారణమంటున్న నిపుణులు
ప్రధాన కారణాలివే..
భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే కా వడం, భర్త ఒక షిఫ్ట్‌లో పని చేస్తే.. భార్య మరో షిఫ్ట్‌లో పని చేస్తుండటం, దీంతో ఇరువురూ కలిసి గడిపే సమయం దొరకకపోవడం.
స్మార్ట్ ఫోన్లలో ఇతరులతో చాటింగ్‌లు, వీడియో కాల్స్ చేస్తుండటం.
సంపాదన లేదా జీతంలో కొంత మొత్తాన్ని తమ తల్లిదండ్రులకు పంపుతామని ఒకరంటే.. పంపేది లేదంటూ మరొకరు గొడవకు దిగడం.
ఒకరి తల్లిదండ్రులను మరొకరు సూటిపోటి మాటలతో విమర్శించడం.
అభిప్రాయ బేధాలు
కొంత మంది అత్తామామలు అదనపు కట్నం పేరుతో తరచూ వేధింపులకు గురిచేయడంతో దంపతుల మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి. పిల్లలను పాఠశాలలో చేర్పించే విషయంలోనూ ఇద్దరి మధ్య అభ్రిపాయ బేధాలు తలెత్తుతున్నాయి.
భార్య ఏటీఎం కార్డులు తన వద్దే ఉండాలన్న భర్త వాదన కూడా కాపురాలు కూలిపోతుండటానికి కారణమవుతోంది. మెజార్టీ కేసుల్లో ఆర్థికంగా ఎలాంటి సమస్యలు లేకపోయినా కేవలం పంతాలు, పట్టింపులే ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
– వేణుకుమార్, అడ్వకేట్
Comments
Please login to add a commentAdd a comment