టమాటా.. నష్టాల బాట!
చేవెళ్ల: ఆరుగాలం శ్రమించి మట్టి నుంచి సిరులు పండించే అన్నదాతలకు ధరల రూపంలో శరాఘాతం తప్పడం లేదు. ముఖ్యంగా టమాటా పండించే రైతులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధరలు లేక నష్టాలను చవిచూస్తున్నారు. దాదాపు రెండు నెలలుగా మార్కెట్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా రావటం లేదని వాపోతున్నారు. మార్కెట్‌లో అన్నదాతలకు కిలో రూ.2 నుంచి రూ.6 మించి పలకడం లేదు. ఈ ధరలతో లాభాల సంగతి దేవుడెరుగు కనీసం పెట్టుబడులైన మిగిలితే చాలని కర్షకులు భావిస్తున్నారు. పంట దిగుబడులు వచ్చిన రైతులు వాటిని పొలంలోనే తెంపకుండా వదిలేసి నిస్సహాయస్థితిలో కూరుకుపోతున్నారు.
మూడు వేల ఎకరాల్లో సాగు
జిల్లాలో దాదాపు 3 వేలకుపైగా ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేస్తున్నారు. రెండు నెలలుగా మార్కెట్‌లో ధరలు తక్కువగా పలుకుతున్నాయి. అప్పుడప్పుడు ఒకట్రెండు రోజులు కాస్త పెరిగినట్లు కనిపించినా మళ్లీ తగ్గుదల కొనసాగుతుంది. మార్కెట్‌కు రైతులు తీసుకు వచ్చిన 25 కిలోల టమాటా బాక్స్ ధర రూ.50 నుంచి రూ.150 వరకు ఉంది. ఈ ధరలతో తమకు గిట్టుబాటు కావడం లేదని కర్షకులు వాపోతున్నారు. ఈ ధరలతో నష్టాలే తప్ప లాభాలు లేవంటున్నారు. ఒక్కోసారి ఆకాశాన్నంటే ధరలు ప్రస్తుతం కనిష్టం కూడా లేకపోవటం బాధాకరమని ఆవేదన చెందుతున్నారు. ఏపీలోని చిత్తూరు మదనపల్లి నుంచి టమాటా దిగుబడులు పెద్ద మొత్తంలో వస్తుండటంతో ఇక్కడ ధరల తగ్గుదల ఉందని మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించి రైతులకు ఆదుకోవాలని కోరుతున్నారు.
నష్టపోయిన రైతులు
మార్కెట్‌లో టమాటా ధర లు ఎప్పుడైతే బాగుంటా యో అప్పుడే ఇతర కూరగాయలకు డిమాండ్ ఉంటుంది. మంచి ధరలు వస్తాయి. చేవెళ్ల మార్కెట్‌లోకి ఎక్కువగా టమాటా రైతులు వస్తుంటారు. రెండు నెలలుగా ధరలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. బాక్స్ ధర రూ.50 నుంచి రూ.150 వరకు అమ్ము డు పోయింది. దీంతో రైతులు నష్టపోయారు.
– రాఘవేందర్‌గుప్తా, మార్కెట్ ఏజెంట్, చేవెళ్ల
పెట్టుబడులు రాలేదు
ఎకరం పొలంలో టమాటా సాగు చేశాను. కూలీ, రవాణా ఖర్చులు అధికమయ్యాయి. ప్రస్తుతం ధరలు లేక పొలంలోనే వదిలేస్తున్నాం. దీంతో పంట ఎండిపోతుంది. నెలరోజులుగా ధరలు పెరుగుతాయని చూసినా ప్రయోజనం లేదు. పెట్టుబడులు కూడా రావటం లేదు. తమని ప్రభుత్వమే ఆదుకోవాలి.
– విఠలయ్య, రైతు, ఆలూరు
రెండు నెలలుగా మార్కెట్‌లో తగ్గిన ధరలు
కిలో రూ.2 నుంచి రూ.6 మాత్రమే
పెట్టుబడులు సైతం రావడం లేదని రైతుల ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment