యాప్రాల్‌లో దాడికి కుట్ర
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసి, కస్టడీలో ఉన్న వీర రాఘవరెడ్డి విచారణ ముగిసింది. దాడికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు ఆయననుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కోర్టు అనుమతితో పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ చివరిరోజైన గురువారం ఉదయం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వీర రాఘవరెడ్డిని నగరంలోని యాప్రాల్‌కు తీసుకెళ్లారు. రంగరాజన్‌పై దాడికి ముందు రెండు రోజులపాటు రామరాజ్యం సైన్యంతో యాప్రాల్‌లోని ఓ ఇంట్లో వీర రాఘవరెడ్డి సమావేశం నిర్వహించాడు. అక్కడే దాడికి కుట్ర జరిగిందనే విషయాలను నిందితుడి నుంచి రాబట్టారు. రెండు రోజుల సమావేశంలో ఏయే అంశాలపై చర్చ జరిగింది? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. రామరాజ్య స్థాపనలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకోసం పనిచేయాలని.. అందుకు సహకరించనివారి అడ్డు తొలగించుకోవాలని వీరరాఘవరెడ్డి సైన్యంతో ప్రతిజ్ఞ చేయించినట్లు సమాచారం. అక్కడి నుంచి నిందితుడిని మణికొండలోని తన నివాసానికి తీసుకెళ్లి పరిశీలించారు. ఇంట్లో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. అనంతరం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయానికి తలరించారు. డీసీపీ శ్రీనివాస్, వీర రాఘవరెడ్డిని పలు ప్రశ్నలు అడిగి కీలక విషయాలను రాబట్టారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి రంగరాజన్‌పై దాడి చేయడానికి ముందు ఏం జరిగిందనే విషయాలను తెలుసుకున్నారు. మూడు రోజుల విచారణలో తెలుసుకున్న కీలక విషయాలతో నివేదిక రూపొందించారు. గురువారం కస్టడీ ముగిసిన నేపథ్యంలో శుక్రవారం అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం శుక్రవారం కోర్టులో సమర్పించనున్నారు.
దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం పనిచేయాలని ప్రతిజ్ఞ
రామరాజ్య స్థాపనకు సహకరించని వారిని అడ్డు తొలగించాలని దిశానిర్దేశం
పోలీసుల విచారణలో వెల్లడించిన వీర రాఘవరెడ్డి?
ముగిసిన మూడు రోజుల కస్టడీ
నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment