పరికి చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు
ఆల్విన్‌కాలనీ: కూకట్‌పల్లి మండల పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ పరికి చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రాలో జేసీబీని నడిపే ఓ ఉద్యోగి నిర్మాణంలో ఉన్న తన ఇంటిని తానే కూల్చివేసుకోవడం గమనార్హం. తనకు చెందిన ఇంటి స్లాబ్ నిర్మాణాన్ని వదిలివేయాలని అతడు అధికారులను బతిమిలాడినా వారు ససేమిరా అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాల వెంట కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనుగోలు చేసుకోవాలని, కష్టపడిన సొమ్మును వృథా చేసుకోరాదని అతడికి వారు సూచించారు. హైడ్రా సిబ్బంది అయినా, రాజకీయ నాయకులైనా, కబ్జాదారులైనా, ప్రభుత్వ భూములు, చెరువు స్ధలాలు, నాలా పరిసర ప్రాంత స్థలాలను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. కాగా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారనే విషయం తెలియడంతో స్థానికులు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశామని, ఇల్లు కట్టుకుంటున్న తరుణంలో కూల్చివేయటమేంటని బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment