
బీమా.. ఏదీ ధీమా?
షాబాద్: అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు భరోసా కరువైంది. బీమాతో రైతులను ఆదుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. రెండేళ్లుగా అధిక వర్షాలతో జిల్లాలోని చాలా మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి పంటల బీమా నుంచి వైదొలగడంతో రాష్ట్రంలో ఆరేళ్ల నుంచి పంటల బీమా పథకం నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా రైతులు పంట నష్టపోతే బీమా కల్పించి పరిహారాన్ని అందించేలా పథకాన్ని అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో రైతుల పంటలకు బీమా ప్రీమియం చెల్లిస్తుంది. దీంతో రైతులకు పంట నష్టం జరిగితే బీమా ద్వారా పరిహారం అందుతుంది. రాష్ట్రంలో పంటల బీమా లేకపోవడంతో ఐదేళ్ల నుంచి పంటలు నష్టపోతే పరిహారం అందడం లేదు. ప్రభుత్వం సైతం నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడం లేదు.
పంటల బీమా లేని రాష్ట్రంగా..
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం నుంచి వైదొలగడంతో కొత్త పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు. ఆరేళ్లుగా పంటల బీమా పథకం రాష్ట్రంలో లేకపోవడంతో తాము అధికారంలోకి వస్తే పంటలు నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందేలా పంటల బీమా తీసుకొస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరుతుందా లేదా అనేది ప్రశ్నగా మిగిలింది.
పరిహారం అందడం లేదు
అధిక వర్షాలతో పంట నష్టం జరిగితే పరిహారం అందే అవకాశం లేకుండా పోయింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో భాగంగా గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలకు రాష్ట్ర వాటాను చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయారు. పంటల బీమాను ప్రవేశపెట్టాలి.
– బాల్‌రాజ్, రైతు, మల్లారెడ్డి, షాబాద్ మండలం
బీమా ఉంటే ఆసరా
పంటల బీమా ఉంటే పంట నష్టపోయిన రైతులకు ఆసరాగా ఉంటుంది. రెండేళ్లుగా అధిక వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం కూడా నష్టపరిహారం అందించడం లేదు. పంటల బీమా ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా పరిహారం అందే వీలుంటుంది.
– విజయభాస్కర్‌రెడ్డి, రైతు, మరియాపురం, షాబాద్ మండలం
ఆరేళ్లుగా నిలిచిన పంటల బీమా పథకం
అధిక వర్షాలతో నష్టపోతే అంతే సంగతులు
రైతులకు అందని పరిహారం
పట్టించుకోని ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment