
అంతర్జాతీయ ప్రమాణాలతో కొహెడ మార్కెట్
అబ్దుల్లాపూర్‌మెట్/తుర్కయంజాల్: కొహెడలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ నిర్మాణం చేపడతామని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్ర మోహన్ తెలిపారు. త్వరలోనే పరిపాలన అనుమతులు మంజూరు చేస్తామని చెప్పారు. గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకుడు లక్ష్మణుడు, జాయింట్ డైరెక్టర్ మల్లేశం, జిల్లా మార్కెటింగ్ రిజిస్టర్ రియాజ్, కోహెడ మార్కెట్ కన్సల్టెంట్ ఉమామహేశ్వర రావుతో కలిసి ఆదివారం ఆయన కొహెడలో పండ్ల మార్కెట్ నిర్మాణం కోసం కేటాయించిన భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అత్యున్నత స్థాయి సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు. త్వరలో సీఎంతో పాటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి మార్కెట్ నిర్మాణానికి పాలనా అనుమతులు మంజూరు చేయడంతో పాటు పనులకు శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు.
200 ఎకరాల్లో రూ.2,900 కోట్లతో..
కొహెడ మార్కెట్లో పండ్లు, పాలు, డ్రై ఫ్రూట్స్, మాంసాహార ఉత్పత్తులతో పాటు పూల వంటి ఉత్పత్తులకు అవకాశం ఉందని సురేంద్రమోహన్ అన్నారు. దాదాపు 200 ఎకరాల్లో రూ.2,900 కోట్లతో మార్కెట్ నిర్మాణం జరుగనుందని చెప్పారు. మార్కెట్‌కి వచ్చే రైతులు, వినియోగదారులు, అమ్ముకునే వర్తకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అత్యున్నత సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు అత్యాధునిక కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం బాటసింగారం పండ్ల మార్కెట్‌లో క్రయవిక్రయాలను పరిశీలించారు. ఏఏ ప్రాంతాల నుంచి పండ్లు దిగుమతి అవుతున్నాయి.. ఏఏ ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయన్న విషయాలను వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కరాచారి, మార్కెట్ సెక్రటరీ ఎల్.శ్రీనివాస్, డైరెక్టర్లు బండి మధుసూదన్ రావు, రఘుపతి రెడ్డి, నరసింహ, జైపాల్ రెడ్డి, మచ్చేందర్ రెడ్డి, గణేశ్ నాయక్, వెంకటేశం గుప్తాం, ఇబ్రహీం, సిబ్బంది పాల్గొన్నారు.
త్వరలో పరిపాలనా అనుమతులు
వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ సురేంద్రమోహన్
Comments
Please login to add a commentAdd a comment