స్వచ్ఛం | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛం

Published Sat, Mar 1 2025 7:47 AM | Last Updated on Sat, Mar 1 2025 7:46 AM

-

శనివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2025
లక్ష్యం..
మున్సిపాలిటీల్లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలు

షాద్‌నగర్‌: పట్టణాల్లో సంపూర్ణ స్వచ్ఛత సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్వచ్ఛమైన పట్టణాలను నిర్మించి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. శ్రీఒక్క అడుగు స్వచ్ఛత వైపుశ్రీ నినాదంతో స్వచ్ఛ సర్వేక్షణ్‌ కార్యక్రమానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. గతంలో నిర్వహించిన మాదిరిగానే ఈసారి కూడా స్వచ్ఛత పోటీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలోని మూడు కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో అందిస్తున్న సేవలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. వచ్చే నెల 31 వరకు అభిప్రాయాలు సేకరించనున్నారు.

టూల్‌కిట్‌ విడుదల

కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థ, రాష్ట్ర పురపాలక శాఖ, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సంబంధించిన టూల్‌కిట్‌ను విడుదల చేశారు. దీని ఆధారంగా సర్వే చేపట్టనున్నారు. మున్సిపాలిటీల్లో పరిశుభ్రత ప్రమాణాలు తనిఖీ చేసి ర్యాంకులు నిర్ధారించనున్నారు. ప్రజల అభిప్రాయం, నిబంధనల మేరకు సర్వీస్‌ లెవల్‌ కార్యక్రమాల అమలు, సర్టిఫికేషన్‌ వంటి విభాగాల్లో సాధించిన ప్రమాణాలను అనుసరించి మార్కులు కేటాయిస్తారు.

సర్వే కోసం యాప్‌

సర్వే నిర్వహించేందుకు వీలుగా యాప్‌ను ఏర్పాటు చేశారు. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా సర్వేకు సంబంధించిన ఫారం, ఓటీపీ వస్తుంది. ఆయా మున్సిపాలిటీల్లో స్వచ్ఛత సాధించడంలో పురోగతిపై పది ప్రశ్నలు ఉంటాయి. వాటిలో ఒక దానిని ఎంచుకొని ఓటీపీ జత చేసి పంపాల్సి ఉంటుంది. మెప్మా సిబ్బంది పట్టణాల్లో తిరుగుతూ ప్రజల అభిప్రాయాలను సేకరిస్తూ యాప్‌లో నమోదు చేస్తున్నారు.

ఫలితాలను బట్టి మార్కులు

ప్రధానంగా మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్తను విడిగా సేకరించడం.. యంత్రాల నిర్వహణ.. డంపు యార్డులు.. మానవ వ్యర్థాల నిర్వహణ.. జియోట్యాగింగ్‌.. పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల పంపిణీ.. నిషేధిత ప్లాస్టిక్‌ వాడకం జరగకుండా చర్యలు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటి ఫలితాలను బట్టి మార్కులు కేటాయిస్తారు. వీటితోపాటు యాప్‌ ద్వారా అడిగే ప్రశ్నలకు సైతం మార్కులు ఉంటాయి.

రానున్న కేంద్రం బృందం

కేంద్ర స్వచ్ఛ సర్వేక్షణ్‌ బృందం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా పట్టణాల్లో పర్యటించనుంది. ఏప్రిల్‌లో కేంద్రం ర్యాంకుల జాబితాను ప్రకటించనుంది.

న్యూస్‌రీల్‌

పట్టణ ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ

పనితీరు మేరకు మార్కుల కేటాయింపు

ఏప్రిల్‌లో ర్యాంకుల జాబితా ప్రకటించనున్న కేంద్రం

మార్కుల కేటాయింపు ఇలా..

మొత్తం మార్కులు – 12,500

ఓడీఎఫ్‌, తాగునీరు – 1,200

గార్బేజ్‌ ఫ్రీ సిటీ – 1,300

మిగిలిన అంశాలకు – 10,000

సర్వే కొనసాగుతోంది

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా వివిధ రకాల సేవలపై సర్వే కొనసాగుతోంది. సిబ్బంది ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నాం. ఈసారి మంచి మార్కులు సాధిస్తామన్న నమ్మకం ఉంది.

– సునీత, మున్సిపల్‌ కమిషనర్‌, షాద్‌నగర్‌

ఇవీ ప్రశ్నలు..

ప్రతి రోజు చెత్త సేకరించేందుకు మీ ఇంటికి లేదా దుకాణానికి వస్తారా?

మీ ప్రాంతాన్ని రోజూ ఊడుస్తూ పరిశుభ్రంగా ఉంచుతున్నారా?

మీ ప్రాంతానికి సమీపంలో చెత్త కుప్పలు పేరుకపోవడంలాంటివి తరచూ కనిపిస్తాయా?

ఇంట్లోని చెత్తను తడి, పొడిగా వేరు చేసి ఇస్తున్నారా?

స్వచ్ఛ ఆటోల వారు తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తారా లేదా కలిపి తీసుకెళ్తారా?

మార్కెట్లు, బజార్లు, పార్కులు, ఉద్యానవనాలు, ఇతర ప్రాంతాల్లోని బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతను నిర్వహించడంలో స్థానిక అధికారులు ఎంత ప్రభావవంతంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు?

మీ నగరంలో చెత్త వ్యర్థాలను మేనేజ్‌ చేయడం కోసం ఉన్న రెడ్యూస్‌, రీయూజ్‌, రీసైకిల్‌ సెంటర్స్‌ గురించి మీకు తెలుసా?

మురుగు కాల్వలు, సెప్టిక్‌ ట్యాంకులను శుభ్రం చేయడానికి లైసెన్స్‌ పొందిన ఆపరేటర్స్‌ని మాత్రమే నియమించుకోవాలని మీకు తెలుసా?

మీ ప్రాంతంలోని పబ్లిక్‌ టాయిలెట్స్‌ యొక్క శుభ్రత, వాటి నిర్వహణపై మీరు ఎంత వరకు సంతృప్తి చెందారు?

మీరు ఎప్పుడైనా పరిశుభ్రతకు సంబంధించిన సమస్యను స్థానిక అధికారులకు రిపోర్ట్‌ చేశారా.. దాన్నివారు ఏవిధంగా పరిష్కరించారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement