పెరుగుతున్న ఎండలు
● మార్చి మొదటివారంలోనే భానుడి భగభగలు ● నిర్మానుష్యంగా మారుతున్న రహదారులు ● ఊపందుకున్నశీతల పానీయాల విక్రయాలు
ఆమనగల్లు: పగటి ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. మార్చి మొదటి వారంలోనే భానుడి భగభగలు సుర్రు మంటున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటాయని మదన పడుతున్నారు. ఈ క్రమంలోనే సీజనల్ వ్యాపారా లు మొదలయ్యాయి. వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు చల్లని పానీయాల వైపు పరుగులు తీస్తున్నారు.
ఆందోళనకరంగా ఎండలు
ఈ ఏడాది ఎండలు ఆందోళనకరంగా ఉంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆమనగల్లు పట్టణంలో గత మూడు రోజులలో దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రస్తుతం 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉదయం 11 గంటలు దాటితే చాలు ఎండవేడిని తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో పట్టణంలోని ప్రధాన రహదారి మధ్యాహ్నం వేళలో నిర్మానుష్యంగా మారుతుంది. ప్రజలు ఉదయం వేళల్లో పనులు చేసుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రారంభమైన సీజనల్ వ్యాపారాలు
వేసవిలో ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాపారాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కొబ్బరిబోండాలు, పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌ల విక్రయాలు జోరందుకున్నాయి. ప్రజలు దాహం తీర్చుకునేందుకు శీతల పానీయాలు, వాటర్ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల కొబ్బరిబోండాలు, పండ్ల రసాలకు డిమాండ్ పెరిగింది. బెంగళూరు, కోనసీమ నుంచి తీసుకు వస్తుండటంతో కాయ నాణ్యతను బట్టి ఒక బోండాను రూ.50 నుంచి 60 వరకు విక్రయిస్తున్నారు. పండ్ల రసాలు, చెరుకు రసాలను రూ.20 నుంచి 40 వరకు విక్రయిస్తున్నారు. దీనితో పాటు పండ్లు, పుచ్చకాయలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఆయా వ్యాపారస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మట్టి కుండల విక్రయాలు
మట్టి కుండలకు గిరాకీ పెరిగింది. ఎండలకు ఉపశమనం పొందడానికి చాలా మంది మట్టి కుండలోని నీటిని సేవిస్తారు. దీంతో పట్టణంలో కూరగాయల మార్కెట్లో వివిధ సైజులలో మట్టికుండల విక్రయాలు జరుగుతున్నాయి. అలాగే ఫ్యాన్లు, కూలర్ల విక్రయాలు కూడా మొదలయ్యాయి. సీజనల్ వ్యాపారాలతో చాలామంది ఉపాధి పొందుతున్నారు.
పెరుగుతున్న ఎండలు
Comments
Please login to add a commentAdd a comment