31లోపు చెల్లిస్తే.. 25 శాతం రాయితీ
● ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులకు శుభవార్త ● వెల్లడించిన కలెక్టర్ నారాయణరెడ్డి
ఇబ్రహీంపట్నం రూరల్: ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తుదారులకు జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి శుభవార్త చెప్పారు. ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ రుసుం ఈ నెల 31లోపు చెల్లిస్తే 25 శాతం రాయితీ వస్తుందని ఆయన ప్రకటించారు. సోమవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఎల్‌ఆర్‌ఎస్‌పై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అక్రమ లే అవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు తీసుకున్న ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకోవా లని సూచించారు. మండల, మున్సిపాలిటీ స్థాయి లో ఎంపీడీఓలు, కమిషనర్లు అక్రమ లే అవుట్లు చేసిన యజమానులతో సమావేశం నిర్వహించి ప్లాటు విక్రయదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, ఆడియో రికార్డింగ్ చేసి ఆటోల ద్వారా ప్రచారం కల్పించాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నవారు రుసుం ఈ నెల 31 లోపు చెల్లించినట్లయితే 25 శాతం తగ్గింపు ఉంటుందని పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తుల లే అవుట్లకు సంబంధించి మండల స్థాయిలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రజావాణిలో 57 ఫిర్యాదులు
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చూడాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు. రెవెన్యూ శాఖలో 34, ఇతర శాఖలకు 23 మొత్తం కలిపి 57 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్, జిల్లా రెవెన్యూ అధికారి సంగీత, వివిధ శాఖల అధికారులు, తహసీల్దార్లు, మున్సిపాలిటీ కమిషనర్లు, సూపరిండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment