శంకర్‌పల్లి: ఆరు నెలల క్రితం తీసుకున్న నిర్ణయం తారుమారవ్వడంతో శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమం మంగళవారం సాదాసీదాగా ముగిసింది. మార్కెట్ కమిటీ పాలవర్గం వివరాలతో సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేయగా.. మరునాడు ఉదయానికే అధికారులు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేశారు. అసంతృప్తుల నుంచి నిరసన సెగ తగలకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్ బందోబస్తు పర్యవేక్షించి పలు సూచనలిచ్చారు. అనంతరం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా గోవిందమ్మ, వైస్ చైర్మన్‌గా కాశెట్టి చంద్రమోహన్ ప్రమాణస్వీకారం చేశారు. 12 మంది డైరెక్టర్లకుగాను ఉదయం ఆరుగురు మాత్రమే ప్రమాణం చేశారు. మిగిలిన ఆరుగురిలో నలుగురు డైరెక్టర్లు కార్యక్రమం ముగిసే సమయానికి.. మరో ఇద్దరు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ వెళ్లిపోయిన అనంతరం అధికారుల సమక్షంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెట్ అధికారి ఎండీ రియాజ్, శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ యోగేశ్, పీఏసీఎస్ చైర్మన్ శశిధర్‌రెడ్డి, నాయకులు ప్రవీణ్, గోపాల్‌రెడ్డి, ప్రకాశ్, వెంకట్‌రాంరెడ్డి, పాండురంగారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వివాదం మొదలైంది ఇలా ..
శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి భార్యకు ఇవ్వాలని పార్టీ, ఎమ్మెల్యే, నాయకులు అంతా కలిసి ఆరు నెలల క్రితమే ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల పేర్లతో ఆర్డర్‌కాపీ సైతం సిద్ధమైంది. ఈ క్రమంలో జనార్ధన్‌రెడ్డి స్వగ్రామం కొండకల్‌లో ప్రైవేట్ కంపెనీల వ్యతిరేకంగా గిరిజనులు భూ పోరాటం చేస్తున్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు సహకారంతో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో జనార్ధన్‌రెడ్డి పాల్గొనడంతో కొంతమంది నాయకులు విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. నాటినుంచి పెండింగ్‌లో ఉంచిన శంకర్‌పల్లి ఏఎంసీకి చైర్‌పర్సన్‌గా జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు గోవిందమ్మ, వైస్‌చైర్మన్‌గా చంద్రమోహన్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వివాదం మొదలైంది.
స్థానం కల్పించాలి.. లేదంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
జనార్థన్‌రెడ్డి తన ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. ఎంతో కాలంగా కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ, కష్టపడి పని చేశాను. సొంత గ్రామంలో తలెత్తిన సమస్యకు మద్దతిచ్చాను తప్పా పార్టీకి ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. తమకు కేటాయించిన పదవిని మరొకరికి కేటాయిస్తామని సమాచారం ఇవ్వకపోవడం బాధాకరం. ప్రస్తుత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సైతం బీఆర్‌ఎస్ సమావేశాలకు వెళ్లారు. ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదన్నారు. తనకు సముచిత స్థానం కల్పించని ఎడల భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ కార్యదర్శి ఉదయ్‌మోహన్‌రెడ్డి, నూతన డైరెక్టర్లు రవీందర్‌రెడ్డి, ప్రశాంత్, నాయకులు అనిల్, ప్రశాంత్, బల్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భారీగా పోలీసుల బందోబస్తు
సముచిత స్థానం కల్పించాలని కాంగ్రెస్ మండలాధ్యక్షుడి నిరసన
సాదాసీదాగా ప్రమాణ స్వీకారం