షాద్‌నగర్‌రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు చేపట్టిన రిలే దీక్షలు మంగళవారంతో 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని కోరుతూ అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. అనంతరం నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగాలను భర్తీచేస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం భర్తీ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు చేపట్టాలని కోరారు. మాదిగలకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ అమలులోకి వచ్చేంత వరకు ఉద్యమాన్ని విరమించేదిలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాండు, బాల్‌రాజ్, నాగభూషణం, సురేష్, మహేందర్, శ్రీనివాస్, శివశంకర్, యాదగిరి, చందు, శ్రీను, హరీష్, శ్రీశైలం, కృష్ణ, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ