మహేశ్వరం: మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయడానికి అన్ని వర్గాల ప్రజలతో ఉద్యమిస్తామని జేఏసీ చైర్మన్ వత్తుల రఘుపతి పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలో మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫ్యూచర్ సిటీలో మహేశ్వరం మండలాన్ని విలీనం చేయకుండా ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మహా నగరం చేస్తామని గతంలో సీఎం ఎన్నో సార్లు చెప్పారని గుర్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్లార్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎం రేవంత్‌రెడ్డిలను కలిసి తమ సమస్యను విన్నవిస్తామన్నారు. ఈ నెల 21న మండల పరిధిలోని అమీర్‌పేట్ పద్మావతి ఫంక్షన్ హాలులో ఫ్యూచర్ సిటీ జేఏసీ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మనోహర్, సభ్యులు మల్లేష్ యాదవ్, అంధ్యానాయక్, ఈశ్వర్‌ముదిరాజ్, సుదర్శన్‌యాదవ్, యాదయ్య, కృష్ణానాయక్, పాండునాయక్, దత్తునాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేఏసీ చైర్మన్ రఘుపతి