కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్
మాడ్గుల: ఆత్మగౌరవం, సమానత్వం, కుల వివక్షపై పోరాటాలకు సిద్ధం కావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ కారత్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్, మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. ఈ నెల 31న మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సదస్సును నిర్వహించనున్నామని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి రానున్నారని, సంఘం శ్రేణులు, ప్రజలందరూ పాల్గొని సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జగన్, నాయకులు అంజి, లింగం, రామకృష్ణ, శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రేమ పేరుతో లైంగిక దాడి
నాగోలు: ప్రేమ పేరుతో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడమేగాక తన వద్ద ఉన్న ఫొటోలను అందరికీ పంపుతానని బెదిరిస్తున్న యువకుడిపై పోక్సో కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నా యి. మాన్సురాబాద్ వినాయక్‌నగర్ కాలనీకి చెందిన ఓ కుటుంబం కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. వారి కుమార్తె (17) ఇంటి వద్దనే ఉంటోంది. కారు డ్రైవర్‌గా పని చేస్తున్న అదే ప్రాంతానికి చెందిన కిలారి నాగార్జున సదరు బాలికతో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేగాక వ్యక్తిగత అవసరాల నిమిత్తం ఆమె నుంచి బంగారం, నగదు తీసుకున్నాడు. గత కొన్నాళ్లుగా బాధితురాలు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తుండటంతో బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బాధితురాలు ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు శనివారం ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడు నాగార్జునపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.