
ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ
చేవెళ్ల: పేద ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో చేపడుతున్న ఉపాధిహామీ పనులను అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా నిర్వహించాలని డీఆర్‌డీఓ శ్రీలత అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం 2023–24 సంవత్సరానికి సంబంధించి ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా జరిగిన ఉపాధి హామీ పనులు, గుర్తించిన లోటుపాట్లపై సిబ్బందిని వివరణ కోరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఏడాదిలో ఉపాధిహామీ పనులకు సంబంధించి కూలీలు, మెటీరియల్ కలిపి మొత్తం రూ.1.58 కోట్ల పనులు జరిగినట్లు తెలిపారు. దీనికి సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ హిమబిందు, ఎంపీఓ విఠలేశ్వర్‌జీ, అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి కొండయ్య, ఏపీడీ చరణ్‌గౌతమ్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి సునీత, ఎస్‌టీఎం నందు, ఈసీ రాజశేఖర్, టీఏలు నాగేశ్వర్‌రావు, హరిశంకర్, పరమేశ్వర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.