ముగిసిన న్యాయవాది అంత్యక్రియలు
మహేశ్వరం: చంపాపేట్‌లో హత్యకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత, న్యాయవాది ఎర్రబాబు ఇజ్రాయిల్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం మహేశ్వరం మండలం తుమ్మలూరులో మంగళవారం ముగిశాయి. వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు ఆయన నివాసానికి తరలివచ్చి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంత్యక్రియల్లో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతం, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్లు పాశం లక్ష్మీపతి గౌడ్, ఏనుగు జంగారెడ్డి, మహేశ్వరం ఏసీపీ లక్ష్మీకాంతరెడ్డి, సీఐలు వెంకటేశ్వర్లు, కృష్ణంరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా నాయక్, మాదిగ న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది జయకర్ మాదిగ, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
సీనియర్ అడ్వకేట్, కాంగ్రెస్ నేత ఎర్రవాపు ఇజ్రాయిల్ హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తుమ్మలూరుకు చేరుకుని ఇజ్రాయిల్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో న్యాయం కోసం పోరాడేవారికి రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇజ్రాయిల్‌ను కత్తితో పొడిచి హత్య చేసిన దస్తగిరి వెనుక ఉన్నది తేల్చాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు వామన్‌రావు దంపతుల హత్య జరిగి ఏళ్లు కావస్తున్నా నిందితులకు ఇప్పటివరకూ శిక్ష వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తీసుకురావాలని కోరారు.
ఇజ్రాయిల్ పార్థివదేహానికి నివాళులర్పించిన వివిధ పార్టీల నేతలు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు
ముగిసిన న్యాయవాది అంత్యక్రియలు