
సన్న రైస్.. వచ్చేశాయ్
ఇబ్రహీంపట్నం: సన్నబియ్యం వచ్చేశాయి.. స్టాక్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు చేరుకున్నాయి. ఈ మేరకు మంగళవారం నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన కానుకగా రేషన్ కార్డుదారులకు (ఆహార భద్రత కార్డులు) సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లాంఛనంగా పథకాన్ని ప్రారంభించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి (మంగళవారం) అన్ని గ్రామాల్లో రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేయనున్నారు. ఇందు కోసం ఈనెల 25 నుంచి రేషన్ దుకాణాలకు స్టాక్ పాయింట్ల (గోదాం) నుంచి తరలిస్తున్నారు. ఇందులో భాగంగా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఆయా రేషన్ షాపుల్లోకి సన్న బియ్యం చేరుకున్నాయి.
ఒక్కొక్కరి ఆరు కిలోల చొప్పున..
ఇబ్రహీంపట్నం మండలంలో 18,941 ఆహారభద్రత కార్డులకు 37 రేషన్ షాపులు, యాచారం మండలంలో 13,733 ఆహార భద్రత కార్డులకు 26 రేషన్‌షాపులు, మంచాల మండలంలో 12,122 ఆహార భద్రత కార్డులకు 26 రేషన్ షాపులున్నాయి. ఈ మూడు మండలాల్లో 89 షాపులకుగాను 900 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రతి నెల ఇబ్రహీంపట్నంలోని స్టాక్ పాయింట్ నుంచి తరలిస్తారు. రేషన్ దుకాణాల్లో యూనిట్‌కు (కార్డుల్లో ఉన్న ఒక్కొక్కరిని ఒక యూనిట్‌గా) ఆరు కిలోల చొప్పున కార్డుదారులకు పంపిణీ చేస్తారు. కొత్త రేషన్ కార్డుదారులకు కూడా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ప్రజాపాలన, మీ సేవ కేంద్రాల ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా బ్లాక్ మార్కెటింగ్ అవకాశాలు తక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.
స్టాక్ పాయింట్ల నుంచి తరలింపు
రేషన్ దుకాణాలకు చేరిన బియ్యం
రేపటి నుంచి పంపిణీ షురూ

సన్న రైస్.. వచ్చేశాయ్