
కాంగ్రెస్ అంటేనే మోసం
కడ్తాల్: అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించిందని.. మాయమాటలతో మభ్యపెట్టి గద్దెనెక్కిన సర్కార్ పాలనలో ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గురువారం ఆయన మాజీ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌తో కలిసి మండల పరిధిలోని ముద్వీన్, బోయిన్‌గుట్ట తండాలో పర్యటించారు. ముద్వీన్‌లో రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దశరథనాయక్ ఆధ్వర్యంలో పేదింటి ఆడబిడ్డ షేడం యాదమ్మకు నిర్మించిన ఇంటిని ప్రారంభించి బోయిన్‌గుట్టతండాలో మహాత్మాగాంధీ, బీఆర్ అంబేడ్కర్, సంత్‌సేవాలాల్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటనే మోసమని.. తాము అధికారంలోకి వస్తే కల్యాణలక్ష్మి రూ.లక్షతో పాటు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, మహిళలకు ప్రతీ నెల రూ.2,500, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి ఏడాదిన్నర పాలన సగం సగం.. అంత ఆగం ఆగంలా ఉందని ఎద్దేవా చేశారు. గతేడాది యాసంగి, వానాకాలం కలిపి రూ.13వేల కోట్ల రైతుబంధు ఎగ్గొట్టి రుణమాఫీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ జీడీపీ, రాష్ట్ర తలసరి ఆదాయం పెంచితే.. ప్రస్తుత ముఖ్యమంత్రి గుండాయిజం, కుటుంబ ఆదాయం పెంచుకుంటున్నారని ఆరోపించారు. ఫోర్త్ సిటీ ఎవరి కోసం.. పేదల భూములు లాక్కొని గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం ఎందుకోసమని ప్రశ్నించారు. పేదలకు పట్టాలిస్తామని చెప్పిన ప్రభుత్వం.. గద్దెనెక్కి భూములు గుంజుకుంటుందని మండిపడ్డారు. నెలకు రూ.4వేల ఫించన్ ఇస్తామని 16 నెలల పాలనలో రెండు నెలల ఫించన్లు ఎగ్గొటాడన్నారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, కేసీఆర్ కిట్, ఫీజు రీయింబర్స్‌మెంట్ అన్ని బంద్ అయ్యాయని వివరించారు. ప్రభుత్వం హెచ్‌సీ యూ వర్సిటీ భూములు అమ్ముకునేందుకు కుట్రపన్నుతోందన్నారు. నల్లమల బిడ్డనని, పాలమూరు బిడ్డనని చెప్పే సీఎం రేవంత్‌రెడ్డికి పౌరుషం ఉంటే పోలీసులు లేకుండా బోయిన్‌గుట్ట తండాకు వస్తే ప్రజలే సమాధానం చెబుతారని సవాల్ విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రతీ పేదవాడి అకౌంట్‌లో రూ.15లక్షలు వేస్తామని మోసం చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు.
రాష్ట్రంలో రక్షణ కరువు: సబితారెడ్డి
రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. విదేశీ మహిళలపై దాడులు జరుగుతుంటే రక్షణ ఎక్కడ ఉందని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో మహిళపై జరిగిన దాడి అత్యంత దారుణమని, రాష్ట్రంలో మహిళలపై హింస పెరిగిపోయిందని, ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న దాడులను నిరోధించడంలో విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్‌భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాంబల్‌నాయక్, ఉపాధ్యక్షుడు ధశరథ్‌నాయక్, సింగిల్‌విండో చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎడ్మ సత్యం, ఎర్రోళ్ల శ్రీను, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పరమేశ్, మార్కెట్ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్, అంజినాయక్, నర్సింహగౌడ్ తదితరులు ఉన్నారు.
ముఖ్యమంత్రి పాలన సగం సగం.. అంతా ఆగమాగం
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు
బీఆర్‌ఎస్‌యే రాష్ట్రానికి శ్రీరామ రక్ష
మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ సభలో మాజీ మంత్రి హరీశ్‌రావు

కాంగ్రెస్ అంటేనే మోసం