
హైదరాబాద్–శ్రీశైలం రహదారిని విస్తరించాలి
ఆమనగల్లు: హైదరాబాద్–శ్రీశైలం రహదారిని విస్తరించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఆచారి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కండె హరిప్రసాద్‌తో వెళ్లి కేంద్రమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం శ్రీశైలం– హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిందని, వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. వాహనాల రద్దీకి అనుగుణంగా ఉండేలా రహదారని నాలుగు లేన్లుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు.
జూ పార్కులో రైనో ఫుడ్ కోర్టు ప్రారంభం
చార్మినార్: నగరంలోని జంతు ప్రదర్శన శాలకు వచ్చే సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా అన్ని రకాల సేవలను అభివృద్ది చేస్తున్నట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్‌ఓఓఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్ అన్నారు. జూ పార్కులో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫుడ్ కోర్టును అటవీశాఖ అందుబాటులోకి తెచ్చింది. రైనో పేరుతో ఫుడ్ కోర్టు ప్రారంభమైంది. అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్‌ఓఓఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్ కొత్త క్యాంటీన్ సేవలను శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు, జూ పార్క్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ హిరేమత్, క్యూరేటర్ వసంత పాల్గొన్నారు.
పుప్పాలగూడలో హిట్ అండ్ రన్
స్విగ్గీ డెలివరీ బాయ్ దుర్మరణం
మణికొండ: కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న యువకుడు వేసవి సెలవుల్లో స్విగ్గీబాయ్‌గా చేరి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధి లోని పుప్పాలగూడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. నార్సింగి పోలీసుల కథనంప్రకారం.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన కుతాడి జీవన్ కుమార్ (21) కానిస్టేబుల్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. వేసవి సెలవులు ఉండటంతో నగరానికి వచ్చి స్విగ్గీ డెలివరీ బాయ్‌గా చేరాడు. తన తండ్రికి ఇటీవల గుండె ఆపరేషన్ కావటం, కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో నగరానికి వచ్చి పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పుప్పాలగూడ ఈఐపీఎల్ కార్నర్ స్టోన్ సమీపంలో జీవన్ ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. కింద పడిన అతడిపై నుంచి వెనకగా వచ్చిన టిప్పర్ వెళ్లడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, టిప్పర్‌ల డ్రైవర్‌లు పరారయ్యారు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హైదరాబాద్–శ్రీశైలం రహదారిని విస్తరించాలి