
నేటి నుంచి తెలంగాణ తొలి విత్తన పండుగ
ఏర్పాట్లను పరిశీలించిన నిర్వాహకులు
కడ్తాల్: అన్మాస్‌పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ తొలి విత్తన పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం ఆమె సంస్థ ప్రతినిధులతో కలిసి ఎర్త్ సెంటర్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విత్తన పండుగకు దేశ నలుమూలల నుంచి రైతులు, నిపుణులు పాల్గొంటున్నారని చెప్పారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన 50 స్టాల్స్‌లో సంప్రదాయ విత్తనాల ప్రదర్శన ఉంటుందని చెప్పారు. ఆమె వెంట సీజీఆర్ ఫౌండర్ లక్ష్మారెడ్డి, పాలసీ నిపుణులు దొంతి నర్సింహారెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, సంస్థ నిర్వాహకులు జేఏఎస్‌ఆర్ అన్నమయ్య, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
శభాష్.. బలరాం నాయక్
కొడంగల్: ఆస్తి పన్ను వసూలులో చొరవ చూపి న కొడంగల్ మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్‌ను సీడీఎంఏ(కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్) టీకే శ్రీదేవి అభినందించారు. గురువారం హైదరాబాద్‌లో ని సీడీఎంఏ కార్యాలయంలో ప్రశంసా పత్రంఅందజేశారు. మున్సిపల్ పరిధిలో ఆస్తి పన్ను వసూలులో ముందున్నారని కొనియాడారు. మెరుగైన ప్రతిభ కనబరచి 83 శాతం ఆస్తి పన్ను వసూలు చేసినట్లు తెలిపారు. విధి నిర్వహణలో ఆయన చూపిన చొరవను అభినందిస్తూ ప్రశంసా పత్రం అందజేశారు.
అవినీతి జలగలపై విచారణ
అర్బన్ పార్కులో పర్యటించిన
విజిలెన్స్ అధికారులు
బషీరాబాద్: తాండూరు అర్బన్ పార్కులో జరిగిన అక్రమాలపై అటవీశాఖ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.పార్కులో రూ.16 లక్షల నిధులతో చేపట్టిన వాకింగ్ పాత్ పనుల్లో బీట్ ఆఫీసర్ మల్లయ్య, సెక్షన్ అధికారి ఫీర్యా నాయక్ అవినీతికి పాల్పడినట్లు ఇటీవల ‘సాక్షి’ దినపత్రికలో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై చీఫ్ కన్జర్వేటర్ ప్రియాంక వర్గీస్ విచారణకు ఆదేశించారు. ఇప్పటికే వికారాబాద్ డీఎఫ్‌ఓ ప్రాథమిక విచారణ జరపగా, మార్చి 27వ తేదీ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వివరాలు సేకరించారు. గురువారం స్టేట్ ఫారెస్ట్ విజిలెన్స్ డీఎఫ్ ఓ ముకుంద్‌రెడ్డి ఆధ్వర్యంలో మరోసారి విచా రణ చేపట్టి.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారులనూ ప్రశ్నించినట్లు తెలిసింది. అనంతరం తాండూరు రేంజ్ కార్యాలయంలో రికార్డులను, బషీరాబాద్ మండలం గొట్టిగా కళాన్ గ్రామంలో అటవీ భూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించారు.
వికారాబాద్ కలెక్టరేట్‌లో
కంట్రోల్ రూం ఏర్పాటు
అనంతగిరి: జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నందున కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతీక్‌జైన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా సమస్య ఏర్పడితే 08416–242136 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు. సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణ కేంద్రం ప్రారంభం
కొడంగల్: రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డీఆర్‌డీఓ శ్రీనివాస్ ప్రారంభించారు. కొడంగల్ నియోజకవర్గంలోని నిరుద్యోగులు అధిక సంఖ్యలో స్వయం ఉపాధి పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉషశ్రీ బాలకృష్ణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

నేటి నుంచి తెలంగాణ తొలి విత్తన పండుగ

నేటి నుంచి తెలంగాణ తొలి విత్తన పండుగ