
‘ఫ్యూచర్’ బాస్ ఎవరు?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సీఎం రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో కీలకమైన అడుగు పడనుంది. ఈ మేరకు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ)కి కమిషన ర్‌ను నియమించనున్నారు. చురుకైన యువ ఐఏఎస్ అధికారిని ప్రాజెక్ట్ సారథిగా నియమిస్తే బాగుంటుందనే భావనలో సీఎం రేవంత్ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిస్తున్న ఫోర్త్ సిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్‌సీడీఏ పరిధిని ప్రత్యేకంగా భావిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ, ఫార్మా, క్రీడారంగాలకు ప్రాధాన్యతనిస్తున్న సర్కారు.. ఆ మేరకు జోన్లను కూడా నిర్దేశిస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్న ప్రభుత్వ పెద్దలు అంతర్జాతీయ నగరాలపై అవగాహన ఉన్న అధికారులకు దీని పాలనాపగ్గాలు కట్ట బెట్టే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. గతంలో కలెక్టర్లుగా వ్యవహరించిన కె.శశాంక (2013), డాక్టర్ ఎస్.హరీశ్ (2015) పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రాంతంపై వీరికి స్పష్టమైన అవగాహన ఉండడం కలిసొచ్చే అంశం. గోపి (2016) పేరును సైతం పరిశీలించి త్వరలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
ఫోర్త్ సిటీ అభివృద్ధే లక్ష్యం
హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత గ్రేటర్‌లో ఫోర్త్ సిటీ అవసరం ఉందని సీఎం నిర్ణయించారు. 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫోర్త్ సిటీని అభివృద్ధి చేయాలన్నది సర్కార్ లక్ష్యం. మహేశ్వరం, ఆమన్‌గల్లు, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల తదితర ఏడు మండలాల్లోని 56 గ్రామాలు ఎఫ్‌సీడీఏ పరిధిలోకి వస్తాయి. ఇప్పటికే ఎఫ్‌సీడీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా.. మిగిలిన 56 పోస్టులను ఔట్ సోర్సింగ్/కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తారు. ఎఫ్‌సీడీఏ కమిషనర్ నియామకం పూర్తవగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం మరింత వేగం పుంజు కుంటుందని అధికారులు చెబుతున్నారు.
నాలుగేళ్లలో కార్యరూపం
ఇప్పటికే ఫోర్త్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం ప్రారంభంకాగా పనులు చకచకా సాగుతున్నాయి. ఉగాది తర్వాత ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇదే సమయంలో ఫ్యూచర్ సిటీకి అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేసేందుకు గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణానికి సైతం ప్రణాళికలు సిద్ధమయ్యాయి. మరోవైపు ఫ్యూచర్ సిటీలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను సైతం వేగవంతం చేసింది. వచ్చే నాలుగేళ్లలో ఫ్యూచర్ సిటీకి ఓ రూపం తీసుకువచ్చేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.
త్వరలోనే ఫ్యూచర్ సిటీ అథారిటీకి కమిషనర్ నియామకం
యంగ్ అండ్ డైనమిక్ ఐఏఎస్ అధికారికి పగ్గాలు
యువ ఐఏఎస్‌లు శశాంక, హరీశ్, గోపి పేర్ల పరిశీలన
ఇప్పటికే అథారిటీ కోసం 90 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

‘ఫ్యూచర్’ బాస్ ఎవరు?

‘ఫ్యూచర్’ బాస్ ఎవరు?