
జలమండలికి ‘వరల్డ్ వాటర్’ అవార్డు
సాక్షి, సిటీబ్యూరో: జలమండలిని వరల్డ్ వాటర్ అవార్డు వరించింది. వాటర్ డైజెస్ట్ అనే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ 2024–2025 సంవత్సరానికి గాను 19వ వాటర్ డైజెస్ట్ వరల్డ్ వాటర్ అవార్డుల కు ప్రభుత్వ కేటగిరీలో జలమండలి ఎస్టీపీని ఎంపిక చేసింది. రెండు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన కార్య క్రమంలో జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ అవార్డు అందుకున్నారు. బుధవారం ప్రధాన కార్యాలయంలో ఆయన ఈడీ చేతుల మీదుగా ఎండీ అశోక్ రెడ్డికి అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో అందరికీ తాగునీరు అందించడంతో పాటు.. మురుగును శుద్ధి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. నాగోల్ ఎస్టీపీ పర్యావరణ అనుకూలత, సమర్థంగా మురుగు నీటి శుద్ధి, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో విశేష ప్రాముఖ్యతను చూపినందుకు నాగోలు ఎస్టీపీ ఈ అవార్డుకు ఎంపికైందని తెలి పారు. కార్యక్రమంలో జలమండలి ఈడీ మయాంక్ మిట్టల్, ఎస్టీపీ సీజీఎంలు పద్మజ, సుజాత, జీఎం కుమార్, డీజీఎం నిరుపమ పాల్గొన్నారు.