
వామ్మో పహాడీషరీఫ్!
పహాడీషరీఫ్: నగర శివారుగా ఉన్న పహాడీషరీఫ్ పరిసరాలను నేరస్తులు తమకు అనువైన ప్రాంతంగా ఎంచుకుంటున్నారు. ఏదైనా నేరం చేయాలన్నా.. చేసిన నేరానికి సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేయాలన్నా ఈ ప్రాంతమే సరైనదిగా భావిస్తున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో నిర్మాణాలు రూపుదాల్చుకోకుండా నిర్మానుష్య ప్రాంతం అధికంగా ఉండడంతో ఏ తప్పైనా మూడో కంటికి కనబడకుండా చేయొచ్చన్న ఆలోచనకొస్తున్నారు. మూడు రోజుల క్రితం నిందితుడు అస్లాం జర్మనీ యువతిని ఈ ఆలోచనతోనే పహాడీషరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకొచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదే స్టేషన్ పరిధిలో 2014లో చోటు చేసుకున్న స్నేక్‌గ్యాంగ్ ఘటన కూడా అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. వెరసి ఇలాంటి ఘటనలతో ఈ ప్రాంతం నేరమయమైనదిగా అపకీర్తిని మూటగట్టుకోవాల్సి వస్తుంది.
అసాంఘిక కార్యకలాపాలు
నగరంలో విద్యనభ్యసిస్తున్న కొంత మంది కళాశాలల విద్యార్థులు తమ నీచ కార్యకలాపాలకు ఈ ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా మామిడిపల్లి, జల్‌పల్లి మధ్యలో రెండు దశాబ్దాల క్రితం చేసిన లేఅవుట్లు నిర్మాణాలు లేకుండా నిర్మానుష్యంగా ఉంటున్నాయి. భారీ చెట్లతో వనాన్ని తలపించే జల్‌పల్లి గ్రీన్ హోం వెంచర్లలో నిత్యం జంటలు వచ్చి ఏకాంతంగా గడుపుతున్నారు. ఇలాంటి వారితో క్రైమ్ రేట్ పెరిగే అవకాశం ఉంది. 2014లో ఇదే తరహాలో ఫాం హౌజ్‌లో గడిపేందుకు వచ్చిన జంటను గమనించిన స్థానికంగా క్రికెట్ ఆడుతున్న కొందరు యువకులు వారిని పాముతో బెదిరించి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన(స్నేక్ గ్యాంగ్) తెలిసిందే. గతంలో పాతబస్తీ నుంచి సరాదా చేసేందుకు తుక్కుగూడ వైపు వచ్చిన ఓ ప్రేమ జంట గొడవపడి.. యువకుడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. గరిగుట్ట పరిసరాలలో కూడా ఇలాంటి ప్రభావమే ఉంది. పోలీసు అధికారులు ఇలాంటి ప్రాంతాలపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.
ఎక్కడో హత్య చేసి.. ఇక్కడ పడేసి
తమ శత్రువులను ఎక్కడో హత్య చేస్తున్న నిందితులు అర్ధరాత్రి వేళ మృతదేహాలను తీసుకొచ్చి స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతాలలో పడేస్తున్నారు. దీంతో ఉదయాన్నే చూస్తున్న పోలీసులు కేసు ఛేదించేందుకు తలలు పట్టుకోవాల్సి వస్తుంది. జల్‌పల్లి పెద్ద చెరువు, తుక్కుగూడ హైవే పరిసరాలలోనే మృతదేహాలను పడేసేందుకు అనువైన స్థలంగా ఎంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఇతర ప్రాంతాలలో హత్య చేసి ఇక్కడ పడేస్తుండగా.. మరికొన్ని సార్లు ఇక్కడ మద్యం పార్టీలు చేసుకుంటూ పథకంలో భాగంగా హత మారుస్తున్నారు.
అధిక శాతం ఉత్తర భారతీయులే
ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన ప్రజలు జీవనోపాధి నిమిత్తం నగరానికి అధిక సంఖ్యలో వస్తుంటారు. వారంతా పహాడీషరీఫ్ ఠాణా పరిసరాల్లో ఎక్కువగా నివాసం ఉంటున్నారు. ఇలాంటి వారు హత్యకు గురవుతుండడం.. ఒక్కోసారి వీరే హత్యలు చేసి తమ స్వరాష్ట్రాలకు పారిపోతుండడంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి నెలకొంటుంది. వీరితో పాటు పాతబస్తీ నుంచి వచ్చి కూడా ఇక్కడ హత్యలు చేసిన ఘటనలు ఎన్నో వెలుగుచూశాయి. చాలా వరకు ఎక్కడో హత్య చేసి పహాడీషరీప్ పోలీస్‌స్టేషన్ పరిసరాలలో పడేసిన మృతదేహాలలో పోలీసులు కేసులను ఛేదించినప్పటికీ.. ఇంకొన్ని మాత్రం ఎటూ తేలని పరిస్థితి నెలకొంది.
నేరస్తులకు అడ్డాగా మారిన వైనం
నిర్మానుష్య ప్రాంతాల్లో తరచూ ఘటనలు
నిఘా పెంచాలని స్థానికుల విన్నపం
మచ్చుకు కొన్ని ఘటనలు
2023 ఏప్రిల్ 12న బడంగ్‌పేట్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డి అనే నిందితుడు సైదమ్మ అనే మహిళను హత్య చేసి రాత్రిపూట కారులో తీసుకొచ్చి తుక్కుగూడ హైవేపై పడేసి పరారయ్యాడు.
2023 మే 25న యూపీకి చెందిన పూరన్‌సింగ్(30)ను అతని ప్రియురాలు, మరికొందరు కలిసి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డ్రమ్ములో కుక్కి, సూరం చెరువులో పడేశారు.
2021 ఆగస్టు 3న జల్‌పల్లి కార్గో రోడ్డు పక్కన గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. రెండేళ్లు కావొస్తున్నా మృతుడు ఎవరో.. హత్య చేసిందెవరో తెలియరాలేదు.
మామిడిపల్లిలోని ఎస్‌ఎస్‌పీడీఎల్ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో ఉన్న గెస్ట్ హౌజ్‌లో 2016 జూన్ 25న ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రమాకాంత్ పాండే(40) దారుణ హత్యకు గురయ్యాడు. వెంచర్‌లోకి తాను తీసుకొచ్చిన ఓ యువతి, యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావించినప్పటికీ వారు ఇంకా దొరకలేదు.
2016 ఆగస్టు 13న పహాడీషరీఫ్–మామిడిపల్లి రహదారి పక్కన ఉన్న ఓ ప్రైవేట్ సంస్థ ఆవరణలో 25 ఏళ్ల గుర్తు తెలియని యువకుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టి హత్య చేసిన ఘటన వెలుగుచూసింది.

వామ్మో పహాడీషరీఫ్!