
శోభాయాత్ర ఏర్పాట్లపై సమీక్ష
వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్ సూచనలు
సాక్షి, సిటీబ్యూరో: శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం శోభాయాత్ర జరగనున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న బందోబస్తు, భద్రత చర్యలపై నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ దృష్టి పెట్టారు. శుక్రవారం ఇన్‌స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఏర్పాట్లపై సమీక్షించారు. అధికారులకు పలు కీలక సూచనలు, సలహాలు అందజేశారు. అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలని, సిటీలోని అన్ని జోనల్ కంట్రోల్ రూమ్స్ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. శోభాయాత్రలో జేబుదొంగతనాలు, చైన్ స్నాచింగ్స్, ఈవ్‌టీజింగ్ వంటివి లేకుండా చూడాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కొత్వాల్‌తో పాటు అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్ సింగ్ మాన్, డీసీపీ (స్పెషల్ బ్రాంచ్) ఎస్.చైతన్య కుమార్ పాల్గొన్నారు.