
సంప్రదాయ విత్తనాన్ని సంరక్షించుకుందాం
కడ్తాల్: కల్తీ విత్తనాల నిర్మూలన.. రైతుకే విత్తన హక్కు అంశాలకు చట్ట రూపం ఇచ్చి అమలు పరిచినప్పుడే దేశీ విత్తనాలను రక్షించుకోగలుగుతామని తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లిలో మూడు రోజులుగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్–భారత్ బీజ్ స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ తొలి విత్తన పండుగ ఆదివారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరెడ్డి మాట్లాడుతూ.. సంప్రదాయ విత్తనాలను సంరక్షించుకోవాలని పేర్కొన్నారు. విత్తన సంరక్షణలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కూరగాయలు, ధాన్యాల విత్తనాలను భద్రపరుచుకుని పంచుకునే విధానాన్ని పునరుజ్జీవంప జేసుకోవాలని అన్నారు. రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. మానవ సాంఘిక జీవనానికి విత్తనం మూలధారమన్నారు. గతంలో రైతులే మేలైన విత్తనాలను నిల్వ చేసి, ఇతరులకు పంచి వ్యవసాయం చేసేవారని, అలాంటి విత్తన మేథో సంపత్తి కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. విత్తనం మూలం ఇదం జగత్ అనే నినాదాన్ని ప్రాచుర్యంలోకి తేవాలని, ఆకుపచ్చ విప్లవం రావాలని అకాంక్షించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా 20 అంశాలతో ఐదు భాషల్లో డిక్లరేషన్ ప్రకటించారు. అనంతరం పాలసీ నిపుణుడు దొంతి నర్సింహారెడ్డి రచించిన ‘ఆరోగ్యానికి.. ఆహార భద్రతకు విత్తనం’ పుస్తకాన్ని విష్కరించారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, ఫౌండర్ లక్ష్మారెడ్డి, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.
వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
ముగిసిన విత్తన పండుగ

సంప్రదాయ విత్తనాన్ని సంరక్షించుకుందాం