
పిల్లలే పెద్దలై..
● ఘనంగా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ షురూ ● ఆలోచింపజేసిన చిన్నారుల నాటక ప్రదర్శనలు
గన్‌ఫౌండ్రి: రంగస్థల నాటక రంగాన్ని కాపాడుకునేందుకు చిన్నారులు నడుం బిగించారు. ఈ మేరకు మొట్టమొదటి ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ థియేటర్ ఫెస్టివల్ సోమవారం రవీంద్రభారతిలో ప్రారంభించారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిశుంబిత స్కూల్ ఆఫ్ డ్రామా ఆధ్వర్యంలో ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయి పిల్లలకు నాటక పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఈ వేడుకల్ని మూడురోజుల పాటు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ రామ్ తెలిపారు. మొదటి రోజు జపాన్‌కు చెందిన రంగస్థల కళాకారులు ‘లూనర్’ అనే అంశంపై ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు ‘మార్పు రావాలి’ అనే అంశంపై ప్రదర్శించిన నాటకం ఆహూతులను ఆలోచింపచేసింది. ది జంగిల్‌బుక్, అయ్యో పాపం, కుయ్యోముర్రో నాటకాలు కూడా అలరించాయి. ఈ సందర్భంగా జపాన్ థియేటర్ డైరెక్టర్ ఎరీనా సాజి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా రంగస్థల నాటక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నా రు. పాఠశాల స్థాయి నుంచే థియేటర్ ఆర్ట్స్‌ను ఒక పాఠ్యాంశంగా చేర్చాలన్నారు. భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ మాట్లాడుతూ నగరంలో మొట్టమొదటి అంతర్జాతీయ బాలల ఉత్సవాన్ని నిర్వహించడం సంతోషకరమన్నారు. ఈ ఫెస్టివల్ యువతలో సృజనాత్మకతను పెంపొందిస్తున్నారు. కాగా రెండవ రోజు నుంచి నేపాల్, భూపాల్, కోల్‌కత్తా, కేరళ వంటి ప్రాంతాలకు చెందిన కళాకారులు హాజరై తమ ప్రదర్శనలను ఇవ్వనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

పిల్లలే పెద్దలై..