
వ్యక్తి బలవన్మరణం
షాద్‌నగర్: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన పురుగుల రమేశ్(40) ఆదివారం ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి రాకపోవడంతో సాధ్యమైన అన్ని ప్రాంతాల్లో వెతికారు. బైపాస్ రోడ్డులోని బుచ్చిగూడ అండర్‌పాస్ సమీపంలో ఉన్న సర్వీస్ రోడ్డులో ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నట్లు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ఇది గుర్తించిన కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్యకు పాల్పడ్డాడా? ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
రూ.92వేల నగదు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం
రాంగోపాల్‌పేట్: వెబ్‌సైట్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ సౌత్‌జోన్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన మేరకు.. ఢిల్లీకి చెందిన అడెం బెట్టింగ్ కోసం రాణీగంజ్‌కు చెందిన సందీప్ కుమార్ గోదెల (30), గోషామహాల్‌కు చెందిన సదానంద్ అభిషేక్ (31), మంగళ్‌హాట్‌కు చెందిన పద్మావార్ యశ్వంత్ గుప్తా(32), అదే ప్రాంతానికి చెందిన గంగారాం వినయ్ (32)లను బెట్టింగ్ కోసం నియమించుకున్నాడు. పాన్‌బజార్‌లోని ఓ ఇంట్లో కంప్యూటర్ పెట్టుకుని ఆన్‌లైన్‌లో ఐపీఎల్ ఖేలో డాట్ కామ్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇందులో సందీప్ సబ్ బుకీ కాగా సదానంద్ అభిషేక్, పద్మావర్ యశ్వంత్‌లు ఫంటర్లు, గంగారాం వినయ్ సింగ్ కలెక్షన్ బాయ్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్–గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్‌జోన్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర, ఎస్సైలు మహేష్, నర్సింహులు, ఆంజనేయులు, నవీన్, మహంకాళి ఎస్సై వెంకటేశ్వర్లు సంయుక్తంగా కలిసి దాడులుచేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి రూ 92,120తో పాటు 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసికున్నారు. ప్రధాన నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆసిఫ్‌నగర్‌లో లిఫ్ట్ ప్రమాదం
విజయనగర్‌కాలనీ: లిఫ్ట్ కుప్పకూలడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం ఆసిఫ్‌నగర్ పోలీస్‌స్టేషన్ చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జి.వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. లంగర్‌హౌజ్‌కు చెందిన సయ్యద్ నసీరుద్దీన్(40) వాహనాల పెయింటర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతని భార్య సికినాబేగం (35), మరదలు మైమునాభేగం(34)లు ఈ నెల 6న ఆసిఫ్‌నగర్ ప్రియా కాలనీలోని నాకో శ్యామ్ రెసిడెన్షీ అపార్ట్‌మెంట్‌కు రాత్రి 11.20 గంటలకు వచ్చారు. 5వ అంతస్తులో ఉన్న బంధువుల ఇంటికి లిఫ్ట్‌లో వెళ్తుండగా 4వ అంతస్తు వద్దకు చేరుకోగానే లిఫ్ట్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతోవారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వైద్య చికిత్సల నిమిత్తం అత్తాపూర్‌లోని జర్మన్‌టైన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.