
యువతి అదృశ్యంపై ఫిర్యాదు
పహాడీషరీఫ్: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. పహాడీషరీఫ్ గ్రామానికి చెందిన మర్ల కృష్ణ కుమార్తె కళావతి(19) ఇంటి వద్దే ఉంటుంది. ఈ నెల 9న మధ్యాహ్నం బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుంది. ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. మన్సూర్ అనే యువకుడిపై అనుమానం ఉందంటూ కృష్ణ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువతి ఆచూకీ తెలిసిన వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62367 నంబర్‌లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
వివాద భూమిలో
సెక్షన్ 164 విధింపు
ఆర్డీఓ సూచనతో తహసీల్దార్ ప్రకటన
తుర్కయంజాల్: ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కమ్మగూడ, తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో బీఎన్‌ఎస్‌ఎస్ కింద సెక్షన్ 164 అమలు చేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కె.అనంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌న్‌రెడ్డి ప్రకటించారు. గురువారం స్థానిక కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ 240, 241, 242లోని 10.09 ఎకరాల భూమి తమదంటే తమదేనని ఇరు వర్గాలు వరుసగా గొడవలకు దిగుతుండటంతో బుధవారం లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినట్లు గుర్తించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉండటంతో సెక్షన్ 164 విధించినట్లు ఆయన తెలిపారు. ప్లాట్లు, భూమి యజమానులతో పాటు, కోర్టు నుంచి ఆర్డర్ పొందిన వారు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరించారు. దీన్ని ఉల్లఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్మినేడులో వడగళ్ల వాన
ఇబ్రహీంపట్నం రూరల్: ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామంలో కురిసింది. భారీ ఉరుములతో వడగళ్లు పడగా.. ఓ ఇంటిపై పిడుగుపడి రేయిలింగ్ కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు.
గంజాయి విక్రేత అరెస్టు
అత్తాపూర్: నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అత్తాపూర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల సమాచారం మేరకు... పహాడీషరీప్ ప్రాంతానికి చెందిన షేక్ జకీర్(42) మహారాష్ట్రలోని అమరావతి నుంచి నిషేధిత గంజాయిని కొనుగోలు చేసి నగరంలో విక్రయిస్తున్నాడు. ఈ నెల 8న మధ్యాహ్నం హసన్‌నగర్‌లో గంజాయిని తీసుకొచ్చి అవసరం ఉన్న వారికి విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో నిందితుడిని పట్టుకొని అతడి నుంచి 1012 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు.

యువతి అదృశ్యంపై ఫిర్యాదు

యువతి అదృశ్యంపై ఫిర్యాదు