
చక్రస్నానం.. తరించిన భక్త జనం
● ముగిసిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ● చివరిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు
మొయినాబాద్: ఎనిమిది రోజులపాటు అంగరంగ వైభవంగా జరిగిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు సోమవారం చక్రస్నానంతో ముగిశాయి. చివరిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం దేవాలయంలోని హోమగుండాల గదిలో పూర్ణహు తి చేపట్టారు. పూర్ణాహుతి ప్రసాదాన్ని అష్టదిక్పాలకులకు నైవేద్యంగా సమర్పించి బలిహరణం చేశారు. అంతకు ముందు స్వామివారిని శ్రీదేవి, భూదేవి సమేతంగా అద్దాలపల్లకీలో ఆసీనులను చేసి అలంకరించారు. అనంతరం చక్రస్వామి, నవపాలికలు, స్వామివారిని పల్లకిలో దేవాలయం చుట్టూ ఊరేగించారు. శివాలయం పక్కనే ఉన్న మండపంలో నవకలశ స్థాపనం, పాలికల పూజతో దేవుళ్లందరినీ ఆవాహనం చేసి సుగంధద్రవ్యాలతో నవకలశ అభిషేకం నిర్వహించారు. చక్రస్వామిని ఆలయ సమీపంలో ఉన్న గండిపేట చెరువులోకి తీసుకెళ్లి చక్రస్నానం చేయించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులందరికీ చక్రతీర్థాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, పరావస్తు రామాచారి, నరసింహన్, కిట్టు, కన్నయ్య, మురళి పాల్గొన్నారు.
దర్శించుకున్న పట్నం మహేందర్‌రెడ్డి
మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ మేనేజింగ్ కన్వీనర్ గోపాలకృష్ణస్వామి, అర్చకుడు రంగరాజన్ ఆయనకు పూలమాల వేసి స్వామివారి ఆశీర్వాదం అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాణయ్య, చిలుకూరు మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి, ఎంపీటీసీ మాజీ సభ్యుడు గుండు గోపాల్, నాయకులు భిక్షపతి, బాల్‌రాజ్, శంకర్ తదితరులు ఉన్నారు.
తరలివచ్చిన భక్తజనం
బ్రహ్మోత్సవాల చివరిరోజు పరిసర ప్రాంతాలతోపాటు నగరం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చక్రతీర్థం సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి అధికంగా విచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ధ్వజావరోహణంతో ముగింపు
బ్రహ్మోత్సవాల ప్రారంభ సూచికగా వస్త్రంపై గరుడ పటాన్ని చిత్రించి ధ్వజస్తంభానికి ఆరోహణం చేసిన వస్త్రాన్ని ముగింపు సూచికగా అవరోహణం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు ప్రకటించారు.