
తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు
కలెక్టర్ నారాయణరెడ్డి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: వేసవి దృష్ట్యా తాగు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త లు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్యను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపితే.. అవసరమైన నిధులను వెంటనే విడుదల చేస్తామని స్పష్టం చేశారు. చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట మరమ్మతులు చేయించాలన్నారు. భవిష్యత్తులో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
విధి నిర్వహణలో
నిర్లక్ష్యాన్ని సహించేది లేదు
కొందుర్గు: విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని శంషాబాద్ డీసీపీ రాజేష్ హెచ్చరించారు. కొందుర్గు పోలీసుస్టేషన్ సోమవారం సందర్శించిన ఆయన పలు రికార్డులను పరిశీలించారు. పీఎస్ రికార్డులు, కేసు ఫైళ్లు, పోలీసు క్వార్టర్స్, పీఎస్‌లో వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెట్రోలింగ్ సిబ్బంది 100 డయల్‌కు కాల్ వచ్చిన వెంటనే జాప్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకొని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు. విజిబుల్ పోలీసింగ్ క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. కార్యక్రమంలో షాద్‌నగర్ రూరల్ సీఐ నర్సయ్య, ఎస్సైలు రవీందర్ నాయక్, బాలస్వామి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అధ్యాపక పోస్టులకు
దరఖాస్తుల ఆహ్వానం
షాద్‌నగర్: పట్టణ సమీపంలోని నూర్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలో కొనసాగుతున్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీతాపోలె సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కళాశాలలో కెమిస్ట్రీ బోధించేందుకు రెండు అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మహిళా అభ్యర్థులు ఈ నెల 20వ తేదీలోపు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో నేరుగా కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
విమానంలో వృద్ధుడికి
అత్యవసర పరిస్థితి..
ఆదుకున్న సిటీ డాక్టర్
సాక్షి, సిటీబ్యూరో: విమాన ప్రయాణంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఓ వృద్ధుడిని నగరానికి చెందిన వైద్యురాలు అత్యవసర వైద్య సేవలతో కోలుకునేలా చేసిన ఘటన ఆదివారం చోటుచేసుకోగా.. సోమవారం వెలుగు చూసింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల ఒంటరి వృద్ధుడికి అకస్మాత్తుగా మగతలోకి జారుకుని, నోటి నుంచి నురగ వచ్చింది. అదే విమానంలో ప్రయాణిస్తున్న నగరంలోని మల్లారెడ్డి విశ్వ విద్యాపీఠం జనరల్ ఫిజీషియన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రీతి రెడ్డి వెంటనే స్పందించారు. ఆయన పల్స్ బలహీనంగా ఉందని, బీపీ తక్కువగా ఉందని గుర్తింంచారు. అత్యవసరంగా సీపీఆర్ చేయడంతో సదరు ప్రయాణికుడు కొన్ని నిమిషాల్లో స్పృహలోకి వచ్చారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ సిబ్బంది సహకారంతో ఆ వృద్ధుడిని క్షేమంగా గమ్యానికి చేర్చారు. సకాలంలో స్పందించి వృత్తి పరమైన నిబద్ధతను ప్రదర్శించిన డా.ప్రీతిరెడ్డిని ప్రయాణికులు అభినందించారు.

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు

తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రానీయొద్దు