
పూజల పేరిట మోసం..
రూ.9.80 లక్షలు వసూలు, అఘోరిపై కేసు నమోదు
శంకర్‌పల్లి: పూజల పేరిట ఓ మహిళ వద్ద డబ్బులు వసూలు చేసిన అఘోరిపై మోకిల పోలిస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శంకర్‌పల్లి మండలం ప్రొద్దటూరు గ్రామానికి చెందిన ఓ మహిళ, ప్రగతి రిసార్ట్స్‌లో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు ఇతరుల ద్వారా అఘోరి పరిచయమైంది. ఈ క్రమంలో ప్రత్యేక పూజలు చేస్తానని సదరు మహిళను నమ్మించిన అఘోరి.. హైదరాబాద్, ఉజ్జయిని తదితర ప్రాంతాల్లో పూజలు చేసింది. అనంతరం ఆ మహిళ నుంచి రూ. 9లక్షల 80వేలను తీసుకుంది. తర్వాత మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు.. ఫిబ్రవరి 25న మోకిల పీఎస్‌లో అఘోరిపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల క్రితం నమోదైన కేసుకు సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం.
క్రషర్ మెషీన్‌లో పడి కార్మికుడి మృతి
మేడ్చల్‌రూరల్: క్రషర్ మెషీన్‌లో పడి కార్మికుడు మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మద్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మనీష్‌సింగ్(27) గిర్మాపూర్‌లోని రోబో సిలికాన్ క్రషర్ మెషీన్‌లో ప్లాంట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారు జామున విధుల్లో ఉన్న అతను ప్రమాదవశాత్తు క్రషర్ మెషీన్‌లో పడటంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లక్కీడ్రా విజేతలకు బహుమతుల అందజేత
తాండూరు టౌన్: హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన లక్కీ డ్రాలో విజేతలకు హనుమాన్ జన్మోత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం బహుమతులు అందజేశారు. హనుమాన్ శోభాయాత్ర సందర్భంగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. మొదటి బహుమతిగా హోండా యూనికాన్ బైక్‌ను విజేత గుముడాల సుధాకర్ (నం.9253), ద్వితీయ బహుమతిగా హోండా ఆక్టీవాను విష్ణురాంజీకి (నం.6981) స్థానిక స్టేషన్ హనుమాన్ ఆలయ చైర్మన్ మిస్కిన్ శంకర్, నరహరి అందజేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ జన్మోత్సవ సమితి సభ్యులు రజినీకాంత్, మహేష్ ఠాకూర్, రామకృష్ణ, పునీత్, భవానీ సింగ్, గురురాజ్, శ్రీనివాస్, ఆనంద్, శివ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
పరామర్శ
తాండూరు రూరల్: మండల పరిధిలోని సంగెంకలాన్ గ్రామానికి చెందిన ఎల్మకన్నె పీఏసీఏస్ మాజీ చైర్మన్ సంగెం నారాయణగౌడ్ సతీమణి ఆదివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి సోమవారం నారాయణగౌడ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంగెం కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, వివిధ పార్టీల నాయకులు, వ్యాపారులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆమె మృతదేహానికి నివాళి అర్పించారు. అంతియ యాత్రలో డీసీసీబీ వైస్ చైర్మన్ రవిగౌడ్, మాజీ సర్పంచ్ మేఘనాథ్‌గౌడ్, నాయకులు రవీందర్, కేశవరావు, పండరి, సాయిలు, బోయ రాజు, హమీద్ మియా, శ్యామప్ప పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో దర్గా ఉత్సవాలు
నవాబుపేట: మండల పరిధిలోని ఎక్‌మామిడి గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న సాహెబ్ హుస్సేన్ దర్గా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతన్నాయి. ఈ ఉత్సవాలకు సోమవారం ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లారెడ్డి, మాజీ సర్పంచ్ ఎండీ రశీ, నాయకులు యాదవరెడ్డి, పాపిరెడ్డి, దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.

పూజల పేరిట మోసం..