
కాలనీలకు ‘దారి’ చూపిన హైడ్రా
తుర్కయంజాల్: ‘హైడ్రా’ చొరవ పలు కాలనీలకు ‘దారి’ చూపింది. తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి కమ్మగూడలోని సర్వే నంబర్లు 213, 214, ఇంజాపూర్ రెవెన్యూ సర్వే నంబర్ 131లో 2.24 ఎకరాల భూమి తమదని, కోర్టు తీర్పు అనుకూలంగా ఉందని, ఎవరూ దీంట్లోకి ప్రవేశించడానికి వీలు లేదంటూ 2023 నవంబర్‌లో వైజయంతి మాల, గోవింద్ దాస్, అమ్రీష్ వీరన్ అనే ముగ్గురు ప్రీకాస్ట్ వాల్ ఏర్పాటు చేశారు. ఈ భూమిని 1974లోనే ఏషియన్ హౌసింగ్ కార్పొరేషన్ వెంచర్ ఏర్పాటు చేయగా అనేక మంది ప్లాట్లను కొనుగోలు చేశారు. ప్రీకాస్ట్ ఏర్పాటు చేయడం, ప్లాట్లలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో చేసేదే లేక బాధితులు కోర్టును ఆశ్రయించారు. పలుమార్లు మున్సిపల్ కార్యాలయం, ప్లాట్ల వద్ద ఆందోళనకు దిగడంతో పాటు పలువురు అధికారులను కలిశారు. అయినా ఫలితం లేకపోయింది. ఇటీవల ప్లాట్ల యజమానులు, స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు శనివారం రెండు జేసీబీలు, బందోబస్తుతో అక్కడికి చేరుకుని ప్లాట్ల చుట్టూ ఉన్న ప్రీకాస్ట్‌ను, రోడ్లకు ఉన్న అడ్డంకులను తొలగించారు. దీంతో శ్రీరంగాపురం, సాయినాథ్ కాలనీ, అపిల్ అవెన్యూ, ఇందిరమ్మ కాలనీ, సుందరయ్య కాలనీ, శ్రీశ్రీ నివాస్ కాలనీలకు వెళ్లే రోడ్డు మార్గం కొన్ని నెలల విరామం తర్వాత సుగమమైంది. దీనిపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
హర్షం వ్యక్తం చేసిన స్థానికులు