పనులు సాగక | - | Sakshi
Sakshi News home page

పనులు సాగక

Published Wed, Apr 23 2025 8:53 AM | Last Updated on Wed, Apr 23 2025 8:53 AM

పనులు

పనులు సాగక

నిధులు లేక..
● పడకేసిన పల్లెపాలన ● అస్తవ్యస్తంగా పారిశుద్ధ్య నిర్వహణ ● వెలగని వీధిలైట్లు.. తాగునీటికి తండ్లాట ● నత్తనడకన అభివృద్ధి పనులు ● నిధులు విడుదల చేయని ప్రభుత్వాలు ● కరువైన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ

సాక్షి, రంగారెడ్డిజిల్లా: సర్పంచుల పదవీకాలం ముగియడం.. 14 నెలలుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండడం.. 15వ ఆర్థికసంఘం నుంచి ఏడు నెలలుగా నిధులు రాకపోవడం.. ఆస్తి పన్నుల రూపంలో వసూలు కావాల్సిన మొత్తం ఆశించినస్థాయిలో రాకపోవడంతో పల్లె ల్లో అభివృద్ధి పడకేసింది. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది.

ఖర్చులకు.. రాబడికి పొంతనేది?

జిల్లా వ్యాప్తంగా 558 పంచాయతీలు, 307 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. ఇటీవల వీటిలో కొన్ని సమీప మున్సిపాలిటీల్లో విలీనం కాగా, మిగిలినవి ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 252 మంది గెజిటెడ్‌ స్థాయి అధికారులను రెండు మూడు గ్రామాలకు ఒకరు చొప్పున ప్రత్యేకాధికారులుగా నియమించింది. ఆయా గ్రామాల పరిధిలో 1,722 కిలోమీటర్ల మేర డ్రైనేజీ వ్యవస్థ ఉండగా, వీటిలో 210 కిలోమీటర్లు ఓపెన్‌ డ్రైనేజీ, 1,320 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, 192 కిలోమీటర్లు కచ్చ డ్రైనేజీ ఉంది. 1,631 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు ఉండగా,17,536 వాటర్‌ సంపులు ఉన్నాయి. 2,52,252 నివాసాలకు తాగునీరు సరఫరా అవుతోంది. 3,204 పబ్లిక్‌ నల్లాలు ఉన్నాయి. 536 నర్సరీల్లో 32,57,458 మొక్కలు పెంచుతున్నారు. 865 పల్లె ప్రకృతి వనాలు ఉండగా, వీటిలో 17,44,993 మొక్కలు నాటారు. 253 డంపింగ్‌ కేంద్రాలు, 557 వైకుంఠధామాలు ఉన్నాయి. ఆయా పంచాయతీల నుంచి ఆస్తిపన్నుల రూపంలో 2022–24 ఆర్థిక సంవత్సరంలో రూ.32.69 కోట్లు రావాల్సి ఉండగా, రూ.28.15 కోట్లు మాత్రమే సమకూరాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.104.54 కోట్ల గ్రాంటు విడుదలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులతో పాటు ఆస్తి పన్నుల రూపంలో ఆయా పంచాయతీలకు వస్తున్న ఆదాయానికి.. క్షేత్రస్థాయి ఖర్చులకు.. వస్తున్న రాబడికి ఏమాత్రం పొంతన కుదరడం లేదు. ఏడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో పంచాయతీల నిర్వహణ అధికారులకు భారంగా మారింది.

చేయలేక.. చేతులు చాచలేక..

రోడ్లు, డ్రైనేజీల వంటి అభివృద్ధి పనులకే కాదు కనీసం ట్రాక్టర్లకు డీజిల్‌ ఖర్చులు, వీధిలైట్ల కొనుగోలు, మంచినీటి మోటార్లకు వచ్చే చిన్నచిన్న రిపేర్లకు సైతం చేతులు చాచాల్సి వస్తోంది. ఖర్చులకు ఖాతాలో డబ్బులు లేక అప్పులు చేయాల్సి వస్తోంది. ఔట్‌ సోర్సింగ్‌ కార్యదర్శులు ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. వారికి నాలుగు నెలల వేతనం బకాయి పడడం, ఇస్తున్న వేతనం కూడా చాలా తక్కువగా ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో చేతులెత్తేస్తున్నారు. నెలవారీ ఖర్చులు భారమవుతుండటంతో ఇప్పటికే పలువురు ఔట్‌ సోర్సింగ్‌ కార్యదర్శులు ఉద్యోగం మానేశారు. సర్పంచులు పదవుల్లో కొనసాగినప్పుడు ఖర్చులను సర్దుబాటు చేసేవారు. గ్రామంలో పేరు కోసం సొంత డబ్బులు వెచ్చించేవారు.

చీకట్లోనే మెజార్టీ పంచాయతీలు

ఇటీవల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలకు చాలాచోట్ల విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. వీధిలైట్లు దెబ్బతిన్నాయి. పాడైన లైట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు జీపీల వద్ద కనీస నిధులు లేవు. ఆయా వీధులన్నీ అంధకారంలోనే మగ్గాల్సి వస్తోంది. ట్రాక్టర్‌ డీజిల్‌కు నిధులు లేక పల్లె ప్రకృతి వనాల్లోని చెట్లకు నీరు పోయలేని పరిస్థితి. చాలా చోట్ల మొక్కలు వాడిపోయి కన్పిస్తున్నాయి. విధిలేని పరిస్థి తుల్లో కొంత మంది కార్యదర్శులు అప్పులు చేసి తాత్కాలిక పరిష్కారం చూపుతుంటే.. మరికొంత మంది అటువైపు వెళ్లడానికే వెనకడుగు వేస్తున్నారు.

‘ఇది కేశంపేట మండలంలోని ఓ మారుమూల పంచాయతీ. ఇక్కడ సుమారు 500 మంది జనాభా ఉంది. మిషన్‌ భగీరథ పైపులైన్లు దెబ్బతిన్నాయి. చాలాచోట్ల పైపులు మూసుకుపోవడంతో ఇంట్లోకి నీరు చేరని పరిస్థితి. బోరు నీరు సరఫరా చేయాలన్నా మోటార్లు పని చేయడం లేదు. మరమ్మతులకు జీపీలో కనీస నిధులు కూడా లేవు. విధిలేని పరిస్థితుల్లో ఔట్‌ సోర్సింగ్‌ కార్యర్శి సొంత ఖర్చుతో కంప్రెషన్‌ మిషన్‌ తెప్పించి పైపులైన్లను రిపేరు చేయించాల్సి వచ్చింది’.

‘ప్రస్తుతం ఎండలు భగ్గున మండుతున్నాయి. భూ గర్భజలాలు తగ్గుముఖం పట్టాయి. కరెంట్‌ సరఫరాలో హెచ్చుతగ్గులు, తరచూ తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో మోటార్లు, స్టార్టర్లు కాలిపోతున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాలకు వీధిలైట్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఏ వీధిలో చూసినా అంధకారమే నెలకొంది. అత్యవసర పరిస్థితుల్లో మోటారు రిపేరు చేయించాలంటే కనీసం రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కాలిపోయిన వీధిలైటు స్థానంలో కొత్తగా మరోటి వేయించాలంటే కనీసం రూ.500 నుంచి రూ.1000 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ట్రాక్టర్‌ నెలవారీ డీజిల్‌ ఖర్చు రూ.3వేల వరకు వస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడు నెలలుగా పైసా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీలను ఎలా నెట్టుకురావాలి’ ఇదీ ఓ ఔట్‌ సోర్సింగ్‌ కార్యదర్శి ఆవేదన.

ఇళ్లలో ఉండలేక పోతున్నాం

మా గ్రామంలో ఈదురు గాలులకు విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రాత్రంతా చీకట్లోనే కాలం వెల్లదీసాం. కనీసం ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరు. ఈగలు, దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇళ్లలో ఉండలేకపోతున్నాం.

– నర్సింగ్‌ వెంకటయ్య, లోయపల్లి, మంచాల మండలం

ఇళ్లలోకి మురుగు నీరు

గ్రామంలో నాలుగు వాన చినుకులు వస్తే చాలు కష్టాలు ఎదురైనట్లే. వర్షాలకు అండర్‌డ్రైనేజీ వాల్వ్‌లో మురుగు నీరు నిండి ఇళ్లలోకి వస్తున్నాయి. ఏళ్ల తరబడి మురుగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేదు.

– మాతంగి కమలమ్మ, లోయపల్లి, మంచాల మండలం

పనులు సాగక1
1/3

పనులు సాగక

పనులు సాగక2
2/3

పనులు సాగక

పనులు సాగక3
3/3

పనులు సాగక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement