
ఆరోగ్యానికి వరం
ప్రకృతి ప్రసాదం..
హుడాకాంప్లెక్స్: వేసవి కాలంలో అందరికీ గుర్తుకు వచ్చేవి తాటి ముంజులు. వీటిని ఐస్ యాపిల్ తదితర పేర్లతో పిలుస్తుంటారు. ఈ సహజ ఫలంలో శరీరానికి కావాల్సిన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అధిక మొత్తంలో నీరు ఉండటం వలన శరీర బరువును తగ్గించడానికి ఇవి ఎంతాగానో తోడ్పడతాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అందుకే ముంజలను ప్రకృతి ప్రసాదంతో పోలుస్తుంటారు. వీటిని ఇష్టపడని వారు ఉండరూ. ప్రతి ఒక్కరూ ఆరగిస్తుంటారు. ఇవి ఎక్కువగా వేసవిలో లభిస్తుంటాయి. నగరంలో తాటి వనాలు లేనప్పటికీ.. గ్రామీణ వ్యాపారులు పల్లెల నుంచి పట్టణాలకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. నగరంలోని రహదారులకు ఇరువైపులా తోపుడు బండ్లు, ఆటోలు ఇలా ఏదేనీ వాహనంలో తెచ్చి.. పట్టణ వాసులకు పోషకాలను అందజేస్తున్నారు.
నోరూరిస్తున్న తాటి ముంజలు
వేసవిలో విరివిగా లభ్యం..
ఉపాధి పొందుతున్న గ్రామీణులు
పోషకాలు ఆస్వాదిస్తున్న పట్టణ ప్రజలు
కల్తీలేని ఫలం
కల్తీలేని ఫలాలు తాటి ముంజలు. వీటిని ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. వేసవిలో నిత్యం రంగారెడ్డి జిల్లా మాల్ నుంచి తాటికాయలు తెచ్చి విక్రయిస్తాం. రోజుకు రూ.1500ల నుంచి రూ.2 వేల వరకు ఆదాయం లభిస్తుంది. ఏప్రిల్ మాసంలో కష్టపడితే రూ.లక్ష వరకు మిగులుతుంది.
– రమేష్, వ్యాపారి, మాల్
ఆరోగ్యానికి మేలు
తాటి ముంజలను పొట్టుతో తీసుకుంటే మలబద్దకం తగ్గుతుంది. జీర్ణకోశ సమస్యలకు దివ్య ఔషదంగా పనిచేస్తాయి. ఎక్కువగా పొటాషియం లభిస్తుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
– డాక్టర్ చిలువేరు శ్రీనివాసులు
పోషక భాండాగారం
తాటి ముంజలు శరీరంలోని చక్కెర, ఖనిజ లవణాలను సమతుల్యం చేస్తాయి. విటమిన్ బీ7, కే. సెలెబుల్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్– ఏ,డీ, జింక్, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి. వీటిలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వలన వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది. డీ హైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. పొటాషియం సమృద్ధిగా ఉండడంతో రక్తపోటు అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులను ధరిచేరనివ్వదు. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ముంజలను క్రమం తప్పకుండా తినడం వలన కొలస్ట్రాల్ తగ్గుతుంది. ముంజల్లో ఉండే పోషకాలు జీర్ణ సంబంధిత సమస్యను తగ్గిస్తాయి. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బడం, ఉదర సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. వేసవి తాపానికి వచ్చే వికారం, వాంతులను నివారిస్తుంది. మహిళల్లో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. చికున్ ఫాక్స్‌ను నివారిస్తుంది. ముంజలను గుజ్జుగా చేసి, ముఖానికి పై పూతగా రాసుకుంటే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. చర్మానికి కావాల్సినంత తేమను అందించి, వేసవిలో వచ్చే చెమటకాయల్ని నివారిస్తుంది.

ఆరోగ్యానికి వరం

ఆరోగ్యానికి వరం