
అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని..
● కత్తితో గొంతుకోసి..పెట్రోల్ పోసి తగులబెట్టి ● ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య ● ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన ● నిందితుల అరెస్టు..రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన ఏసీపీ రంగస్వామి
షాద్‌నగర్: అక్రమ సంబంధానికి అడ్డు పడుతున్నా డని భర్తను అంతమొందించాలనుకుంది.. ప్రియు డితో కలిసి పథకం వేసింది.. పథకం ప్రకారంమద్యం మత్తులో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి కత్తితో గొంతుకోసి హత్య చేసింది.. మృతదేహాన్ని గుంతలో పడేసి పెట్రోల్‌తో తగలబెట్టింది.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఏసీపీ రంగస్వామి వివరాలు వెల్లడించారు. ఫరూఖ్‌నగర్ మండలం చిన్నచిల్కమర్రి గ్రామానికి చెందిన ఎరుకలి యాదయ్య(32)కు ఎనిమిదేళ్ల క్రితం కొందుర్గు మండలం మహదేవ్‌పూర్‌కు చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. యాదయ్య కూలి పనులు చేస్తుండగా మౌనిక గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో పని చేస్తోంది. ఈ పరిశ్రమకు మండల పరిధిలోని కంది వనం గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్ తన ఆటోలో కూరగాయలు, వంట సామగ్రి తీసుకొచ్చేవాడు. ఈ క్రమంలో మౌనికకు అతడితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అశోక్‌ను తమకు దూరపు బంధువని భర్తకు పరిచయం చేసింది. భర్తను అడ్డు తొలగిస్తే సుఖంగా ఉండొచ్చని భావించి హత్య చేయాలనుకుంది.
మద్యం మత్తులో ఉండగా..
శంషాబాద్ మండలం రామాంజపూర్‌లోని తన బాబాయ్ ఇంట్లో విందుకు వెళదామని 18 ఫిబ్రవరి 2025న అశోక్ తన ఆటోలో యాదయ్య, మౌనికను తీసుకొని రామాంజపూర్‌కు బయలుదేరారు. నందిగామ మండలం గూడూరు గ్రామ పరిధిలోని పెద్దగుట్టతండా సమీపంలో ఆటోను నిలిపి ముగ్గురూ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న భర్తను పథకం ప్రకారం అశోక్‌తో కలిసి కత్తితో గొంతుకోసి హత్య చేసింది. మృతదేహాన్ని గుంతలో పడేసి పెట్రోల్‌పోసి తగలబెట్టింది. అనంతరం మౌనికను అశోక్ తన ఆటోలో చిన్నచిల్కమర్రి సమీపంలో వదిలి వెళ్లిపోయాడు.
కనిపించడం లేదని ఫిర్యాదు చేసి
ఎప్పటిలాగే ఉదయం పాలు పితకడానికి వెళ్లిన తన భర్త యాదయ్య కనిపించడం లేదని 24 ఫిబ్రవరి 2025న మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెల్‌ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లాడని, నాలుగు రోజులుగా ఇంటికి రాలేదని ఫిర్యాదులో పేర్కొంది. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కొన్ని రోజుల తరువాత మౌనిక, అశోక్ భా ర్యాభర్తలమని చెప్పి పట్టణంలోని అయ్యప్పకాలనీ లో ఇల్లు అద్దెకు తీసుకుని సహజీవనం చేస్తున్నారు. విషయం మృతుడి బంధువులకు తెలియడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించా రు. నిందితులతో ఘటనా స్థలానికి వెళ్లి యాదయ్య ఎముకలు, పుర్రెను సేకరించారు. నిందితుల నుంచి ఆటో, వేటకొడవలి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.
పోలీసులను అభినందించిన ఏసీపీ
శంషాబాద్ అడిషనల్ డీసీపీ రామ్‌కుమార్, ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో పట్టణ సీఐ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో కేసును ఛేదించారు. నిందితుల ను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ సుశీల, హెడ్‌కానిస్టేబుల్ విజయభాస్కర్, సిబ్బంది నరేందర్, రాజేష్, కరుణాకర్‌ను ఏసీపీ రంగస్వామి అభినందించారు.

అక్రమ సంబంధానికి అడ్డొస్తాడని..