
అగ్గిపుడితే.. బుగ్గే.!
అగ్నిమాపక కేంద్రం తరలింపు
గాంధీ మెడికల్ కళాశాల, వసతి భవనాలు, ఆసుపత్రి ఐపీ, ఓపీ, పరిపాలనా భవనాలు, తదితరాలు మొత్తం 38 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇక్కడ అగ్నిమాపక కేంద్రం ఉండాలనే డిమాండ్ ఉంది. దీంతో గతంలో ఆసుపత్రి ప్రాంగణంలో తాత్కాలిక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. ఏదైనా సంఘటన జరిగినపుడు సిబ్బంది అప్రమత్తమయ్యేవారు. కరోనా అనంతరం ఇక్కడున్న అగ్నిమాప కేంద్రాన్ని తరలించారు. ఇప్పుడేదైనా చిన్న సంఘటన జరిగినా సికింద్రాబాద్, చిక్కడ్‌పల్లి కేంద్రాల నుంచి వాహనాలు రావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ట్రాఫిక్‌లో అగ్నిమాపక శకటం ఆసుపత్రి ఆవరణకు చేరుకోవడానికి కనీసం 40 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. ఈ లోగా జరగాల్సిన నష్టం జరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా దీనిపై ఆస్పత్రి సూపరింటెండ్ డాక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామని, అవి పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.
సాక్షి, సిటీబ్యూరో/గాంధీఆస్పత్రి : ఎక్కడైనా ప్రమాదం జరిగినపుడు హడావుడి చేయడం.. నిధులు అవసరం అంటూ నివేదికలు తయారు చేయడం. ఆనక ఆ విషయాన్ని గాలికి వదిలేయడం గాంధీ ఆస్పత్రి అధికారులకు అలవాటుగా మారింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దవాఖానలో అగ్నిప్రమాదాల నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పదేళ్ల నుంచి ఏటా ఫైర్ సేఫ్టీ పరికరాల కొనుగోలుకు సంబంధించి రూ.కోట్లలో ప్రతిపాదనలు పంపిస్తున్నా నేటికీ అవి అనమతులకు నోచుకోక దస్త్రాలకే పరిమితమవుతున్నాయి.
తుప్పుపట్టిన పరికరాలు..
తెలుగు రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాల ప్రజల ఆరోగ్యప్రదాయినిగా వెలుగొందుతున్న గాంధీ ఆస్పత్రిలో ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ రోగులు, వారి సహాయకులు, వైద్యులు, నర్సింగ్, ఇతర సహాయక సిబ్బంది అంతా కలసి రోజు కు సుమారు 15 వేల మంది వరకు రాకపోకలు సాగిస్తుంటారు. 8 అంతస్తుల్లో నిర్మించిన ప్రధాన భవనంలో 36 విభాగాలకు చెందిన ఇన్ పేషెంట్ వార్డులు ఉన్నాయి. 2003లో నిర్మించిన ప్రధాన భవనంలో ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ పరికరాలు నిర్వహణ కొరవడి కొన్ని తుప్పుపట్టి పోగా.. మరికొన్ని దొంగతనానికి గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఫైర్ సేఫ్టీ వ్యవస్థ నిర్వీర్యమైంది. ఇదిలా ఉంటే ఆసుపత్రిలో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర మార్గాలు లేవు. ప్రస్తుతం ఉన్న లిప్టులు, మెట్ల మార్గం ఆసుపత్రి లోపలి నుంచి మాత్రమే ఉన్నాయి. ప్రమాద సమయంలో వీటిని వినియోగించలేరు. అందుకు ప్రత్యామ్నాయంగా భవనం వెలుపల నుంచి మెట్ల మార్గం, ర్యాంప్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు అలాంటివి అందుబాటులో లేవు. దీంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగితే ఆస్తి నష్టంతో పాటు ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి నుంచి భవన నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం
గాంధీ ఆసుపత్రిలో ఫైర్‌సేఫ్టీకి సంబంధించిన ప్రతిపాదనలు గత పదేళ్ల నుంచి కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కొత్త పరికరాల కొనుగోళ్లకు సుమారు రూ.2.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి అప్పట్లో ప్రభుత్వానికి సమర్పించారు. ఆ తర్వాత దాని పర్యవేక్షణ మరిచారు. దీంతో ఆ దస్త్రాలు కాగితాలకే పరిమితమయ్యాయి. అక్కడి నుంచి సందర్భం వచ్చినపుడల్లా పదేపదే నివేదికలు అందించడం తప్ప నిధుల మంజూరుపై శ్రద్ధ వహించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గాంధీ ఆస్పత్రిలో మారని దుస్థితి
దశాబ్ద కాలంగా ప్రతిపాదనలకే పరిమితమైన నివేదికలు
ఉన్న అగ్నిమాపక కేంద్రం తరలింపు
ప్రమాదం జరిగితే హడావుడి.. అనంతరం పట్టించుకోని
ఉన్నతాధికారులు
2019 సంవత్సరం ఆగస్టులో అగ్నిప్రమాదం జరిగి గాంధీ ఆస్పత్రిలోని పీడియాట్రిక్ సర్జరీ ప్రిపరేషన్ వార్డు అగ్నికి ఆహుతైంది. ఆ సమయంలో పిల్లలెవరూ వార్డులో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ విలువైన పరికరాలు దగ్ధమయ్యాయి.

అగ్గిపుడితే.. బుగ్గే.!